అమితాబ్ టూ రజినీకాంత్.. సాయి కుమార్ ఏ హీరోకు డైలాగ్ చెబితే అదిరిపోవాల్సిందే.. అంతలా వేరే భాషల్లో యాక్ట్ చేసిన హీరోలకు తన తెలుగు డబ్బింగ్‌తో వాళ్లకు మనకు దగ్గర చేసారు. ముఖ్యంగా రజినీకాంత్ భాషా సినిమా చూసారా...అందులో రజినీ..భాషా ఒక్కసారి చెబితే...వంద సార్లు చెప్పినట్టు అనే డైలాగ్ గుర్తుంది కదా. రజినీకాంత్ చెప్పిన డైలాగులు థియేటర్స్‌లో పేలడం వెనక వున్న వ్యక్తి ఎవరో కాదు డైలాగ్ కింగ్ సాయి కుమార్.
ఒక్క రజనీకాంత్ మాత్రమే కాదు...రాజశేఖర్ ‘అంకుశం’ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అంతలా పండనీకి కారణం సాయి కుమార్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. హీరోగా సుమన్ నటించిన ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు గాత్ర దానం చేసింది సాయికుమారే. ఇలా తెలుగు హీరోలకే కాదు...ఇక్కడ డబ్ అయిన చాలా చిత్రాలకు తన గొంతుతో ప్రాణ ప్రతిష్ఠ చేసి కింగ్ ఆఫ్ వాయిస్‌గా ఫేమస్ అయ్యారు.
డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాకుండా...హీరోగా...విలన్‌గా..తండ్రిగా...క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలకు తన నటనతో జీవం పోసారు సాయికుమార్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ నటుడిగా, హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సాయికుమార్...1960 జూలై 27న మద్రాసులో ప్రముఖ నటుడు పిజే శర్మ, కృష్ణ జ్యోతిలకు జన్మించాడు. (Twitter/Photo)
డబ్బింగ్ కళాకారుడిగా సాయి కుమార్ తొలి చిత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన ‘సంసారం’. ఆ తర్వాత కొన్నిసినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు సాయి కుమార్. బాలనటుడిగా సాయి కుమార్ మొదటి సినిమా ‘దేవుడు చేసిన పెళ్లి’. ఆ తర్వాత తెలుగు, కన్నడ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేసారు. తెలుగులో నటుడిగా సాయికుమార్‌కు పేరు తెచ్చిన సినిమా ‘కలికాలం’. ఇక హీరోగా డైలాగ్ కింగ్‌కు పేరు తెచ్చిన మూవీ ‘పోలీస్ స్టోరీ’. సినీ ఇండస్ట్రీలో ఈయన 50 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్నారు సాయి కుమార్. (Twitter/Photo)
పోలీస్ స్టోరీ తర్వాత సాయి కుమార్ కన్నడలో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఈ మూవీని తెలుగులో అదే పేరుతో డబ్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్టైయింది. ఈ మూవీలో సాయి కుమార్ చెప్పిన డైలాగులు థియేటర్స్‌లో మారు మోగాయి. ఈ మూవీలో కనిపించే మూడు సింహాలు చట్టానికీ,న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే...కనిపించని ఆ నాల్గో సింహమేరా పోలీస్ అని చెప్పిన డైలాగ్.. ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంది. అంతలా తన డైలాగులతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. ప్రస్తుతం హీరోగా అవకాశాలు తగ్గడంతో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కే చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్‌గా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. (File/Photo)
నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు సాయికుమార్. అమితాబ్, వినోద్ ఖన్నా, రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి, విష్ణు వర్థన్, విజయ్ కాంత్, సత్యరాజ్ సహా ఎంతో మందికి గాత్ర దానం చేసారు. ఒక్క కమల్ హాసన్‌కు తప్ప మిగతా దక్షిణాది హీరోల చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన రికార్డు సాయి కుమార్ సొంతం.