కన్నెగంటి బ్రహ్మానందం.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎక్కడో ఓ చిన్న లెక్చరర్‌గా జీవితం మొదలుపెట్టిన ఈయన.. ఈ రోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడంటే.. దాని వెనక ఎంతో కష్టం, కృషి దాగున్నాయి. తెలుగు సినిమా హాస్య ప్రపంచంలో ఎంతోమంది తారలున్నా.. బ్రహ్మానందం మాత్రం ధృవతార. 1250 సినిమాలకు పైగా నటించి.. ఆడియన్స్‌కు బోర్ కొట్టించకుండా నవ్వించాడు బ్రహ్మి.
బ్రహ్మానందం ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. తన హాస్యంతో తెలుగువారిని అలరించిన బ్రహ్మి ఈరోజు 67వ పడిలోకి అడుగుపెట్టారు. బ్రహ్మానందం కామెడీ టైమింగ్‌తో కొన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. సినిమాలో కామెడీ పండించాలంటే బ్రహ్మి ఉండాల్సిందే. ఓ దశలో అయితే విడుదలైన దాదాపు ప్రతి సినిమాలో ఆయన పాత్ర ఉండేది. కానీ వయసు పై పడటంతో ఇపుడు సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన హాస్యపు సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న కామెడీ ఘనాపాటి బ్రహ్మానందం. టాలీవుడ్లో ఈయన ఓ బ్రాండ్. తెరపై ఆయన కాదు.. అతడి బట్టతల కనిపించినా చాలు హీరోకి పడ్డన్ని విజిల్స్ పడతాయి. గత రెండు దశాబ్దాల నుంచి బ్రహ్మి ప్రస్థానం ఎదురులేకుండా సాగుతుంది. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని క్రేజ్ తో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చాడు బ్రహ్మానందం.
కేవలం ఆయన అప్పియరెన్స్‌తోనే కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో కాలేజ్ లెక్చరర్ కాస్తా ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి కమెడియన్‌గా మారి.. ఇప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రస్ కావడం అంటే చిన్న విషయం కాదు. చిరంజీవి పట్టుకొచ్చిన ఈ టాలెంట్.. ఇప్పుడు తెలుగు పరిశ్రమ నవ్వుకే చిరంజీవిలా మారిపోయింది. తెలుగు సినిమా కళామతల్లి పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వులా ఉండిపోయాడు బ్రహ్మి.
ఎన్నో వందల సినిమాల్లో తనదైన నటనతో మెప్పించాడు ఈయన. మొదట్లో చిన్న సినిమాలు చేసినా కూడా.. 1987లో జంధ్యాల తెరకెక్కించిన అహ నా పెళ్లంటలో ఈయన చేసిన అరగుండు పాత్ర అదిరిపోయింది. అంతకు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు బ్రహ్మానందం. ఈ 36 ఏళ్ళ కెరీర్లో అరడజన్ నందులతో పాటు.. ఓ ఫిల్మ్ ఫేర్.. మూడు సైమా అవార్డులు సొంతం చేసుకున్నాడు ఈ లెజెండరీ కమెడియన్.
దర్శకులు చెప్పినా చెప్పకపోయినా సీన్ పండడానికి తనవంతుగా సొంతంగా కొన్ని ఊత పదాలు కూడా సృష్టించాడు ఈయన. అలా బ్రహ్మానందం నోట్లో నుంచి వచ్చిన జప్ఫా, నీ యంకమ్మా, పండగ చేస్కో డూ ఫెస్టివల్, ఖాన్‌తో గేమ్స్ ఆడకు శాల్తీలు లేచిపోతాయ్.. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లైతే.. ఇలా ఎన్నో మాటలు చిన్న పిల్లల నుంచి ముసలాళ్ల వరకు రోజూ వాడుకుంటారు.
ఈ మీమ్స్‌కు అయితే బ్రహ్మానందం కులదైవం. ఆయన లేకుండా ఒక్క మీమ్ కూడా ముందుకు కదలదు. ఇది కేవలం బ్రహ్మికి మాత్రమే సాధ్యమైన రికార్డు. ఒకప్పుడు బ్రహ్మి ఉంటేనే సినిమా.. కానీ ఇప్పుడు కొత్త కమెడియన్లు చాలా మంది రావడంతో తనకు తానుగా కాస్త పక్కకు జరిగాడు బ్రహ్మి. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ.. తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తున్నాడు ఈయన.