తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు మృతితో టాలీవుడ్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన.. వ్యక్తిగత విషయాలు చూసుకుంటున్నారు. అనారోగ్యం కూడా ఉండటంతో ఈయన బయటికి కూడా పెద్దగా రావడం లేదు. పరిస్థితి విషమించడంతో జనవరి 8న ఈయన కన్నుమూశారు. ఈయన భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు రమేష్ బాబు. ఈయన వయసు 56 సంవత్సరాలు. ఇదిలా ఉంటే 2022, జనవరి 9వ తేదీ మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముందుగా పద్మాలయ స్టూడియోస్‌లో కాసేపు రమేష్ బాబు భౌతిక కాయాన్ని ఉంచారు. అక్కడే కుటుంబ సభ్యులు వచ్చి రమేష్ బాబుకు నివాళులు అర్పించారు.
దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ అంత్యక్రియల్లో పాల్గొనాలని అనుకోవద్దు.. ఎవరికి వాళ్లు ఇంటి నుంచి రమేష్ బాబుకు నివాళులు అర్పిస్తే మంచిది అంటూ కోరుకున్నారు. బయట పరిస్థితి బాగోలేకపోవడంతో ఘట్టమనేని కుటుంబమే ఈ ప్రకటన జారీ చేసింది. మరోవైపు కొడుకు మృతదేహం ముందు కృష్ణ, ఇందిరా దేవి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక రమేష్ బాబు విషయానికి వస్తే బాల నటుడిగానే తండ్రితో కలిసి నటించాడు కృష్ణ.
2004లో తమ్ముడు మహేష్ బాబు హీరోగా వచ్చిన అర్జున్ సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ తర్వాత అతిథి సినిమా నిర్మించాడు. దూకుడు, ఆగడు సినిమాలకు సమర్పకుడిగా ఉన్నాడు. రమేష్ బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరి రావు కూడా వచ్చి రమేష్ బాబుకు నివాళులు అర్పించారు.