పెళ్ళి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఒప్పుకోలేదు. కొడుకు పుట్టిన తర్వాత ఇంటికే పరిమితం అయిపోయింది జెనిలియా. అయితే ఇప్పుడు మళ్లీ ఈ భామకు సినిమాలపై ధ్యాస మళ్లినట్లుంది. అందుకే త్వరలోనే తాను సినిమాలు చేయబోతున్నట్లు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం భర్త రితేష్ నటిస్తున్న సినిమాలకు నిర్మాతగా ఉన్న జెనిలియా త్వరలోనే నటిగా మళ్లీ తెరపై కనిపించబోతుంది.
అయితే పెళ్లైన ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ ఈమెను హీరోయిన్గా ఒప్పుకుంటారా అనేది అనుమానమే. అలాగని జెన్నీ అక్క, వదిన పాత్రల్లో నటిస్తే అభిమానులు తట్టుకోలేరు. మంచి కథ వస్తే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం ఒక్కటే ఇప్పుడు జెనిలియా ముందున్న ఆప్షన్. మంచి కథ వస్తే నటించడానికి తనకేం అభ్యంతరం లేదని చెబుతుంది జెన్నీ బేబీ. అన్నట్లు ఈ మధ్య ఎక్కువగా హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంది జెనీలియా.
పైగా భర్త రితేష్‌తో కలిసి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా అవకాశాల కోసం చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. సరైన కథ వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అయితే ఇప్పుడు ఈమెకు తెలుగులో వచ్చింది అవకాశం. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటిని పరిచయం చేస్తూ సాయి కొర్రపాటి ఓ భారీ సినిమా రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ మధ్యే హీరోను పరిచయం చేస్తూ ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేశారు. ముహూర్తపు షాట్ కూడా తీశారు. రాజమౌళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ కార్యక్రమానికి జెనీలియా కూడా వచ్చింది. సినిమాలో ఈమె అత్యంత కీలకమైన పాత్రలో నటించబోతుంది. దీని కోసం ఈమె భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ సినిమాకు నిర్మాత సాయి కొర్రపాటి అయినా వెనకుండి చూసుకుంటున్నది మాత్రం గాలి జనార్దన్ రెడ్డినే అనేది సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం. అందుకే టెక్నీషియన్స్ మాత్రమే కాదు.. నటీనటులకు కూడా అడిగినంత ఇచ్చేస్తున్నారు. జెనీలియా హీరోయిన్గా మానేసిన తర్వాత.. అతిథి పాత్రలు చేసింది. ఇప్పుడు కారెక్టర్ ఆర్టిస్టుగా వస్తుంది.