నాగార్జున ఓ సినిమాను ఒప్పుకోవాలంటే చాలా ఆలోచిస్తాడు. కెరీర్ మొదట్నుంచి కూడా ఆచుతూచి అడుగులు వేసాడు అక్కినేని వారసుడు. శివ, గీతాంజలి లాంటి క్లాసిక్స్ తర్వాత నాగార్జునతో సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు అనుకున్నారు. స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఈయన కోసం బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా క్యూ కట్టారు. కానీ 36 ఏళ్ళ కెరీర్ లో దాదాపు 10కి పైగా సినిమాలకు నాగార్జున నో చెప్పాడు. వాటికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. మరి నాగ్ నో చెప్పిన సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం..
1. ఘర్షణ: మణిరత్నం దర్శకత్వంలో నటించాలని నాగార్జునకు చాలా పెద్ద కోరిక ఉండేది. కెరీర్ మొదట్లోనే ఆ అవకాశం ఈయన చెంతకు వచ్చింది. కానీ అనుకోని కారణాలతో మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేసే ఆఫర్ చేజార్చుకున్నాడు నాగార్జున. అప్పటికి ఉన్న పరిస్థితుల దృష్ట్యా తన దగ్గరికి వచ్చిన ఘర్షణ సినిమాను నాగార్జున చేయలేకపోయాడు. 1988లో ఇది జరిగితే.. పట్టుబట్టి మరీ మరుసటి ఏడాది గీతాంజలి సినిమా చేసాడు నాగార్జున. మణి తెలుగులో చేసిన ఏకైక సినిమా ఇదే.
2. మెకానిక్ అల్లుడు:కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్స్ కుదరవు అంతే. అలా నాగార్జున చేయాల్సిన సినిమా కాస్తా చిరంజీవి చేతుల్లోకి వెళ్లింది. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన మెకానిక్ అల్లుడు సినిమాను ముందు నాగార్జునతోనే చేయాలని అనుకున్నారు. పైగా ఈ చిత్రంలో నాగేశ్వరరావు కూడా ఉన్నాడు. కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల ట్రాక్ రికార్డు బాగోలేకపోవడంతో నాగ్ తప్పుకున్నాడు.. చిరంజీవి వచ్చాడు. అయినా కూడా మెకానిక్ అల్లుడు ఫ్లాప్ అయింది.
3. ఆహా: నాగార్జున హీరో మాత్రమే కాదు మంచి నిర్మాత కూడా. అయితే తన నిర్మాణంలో వచ్చిన సినిమాలన్నీ తానే నటించాలనే రూల్ కూడా లేదు. కొన్నిసార్లు నచ్చిన కథలను వదిలేసుకున్నాడు నాగార్జున. అలా తాను చేయలేని సినిమాలను మరో హీరోతో నిర్మించాడు. నాగార్జున అలా మిస్ అయిన సినిమా ఆహా. జగపతిబాబు హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సినిమాను నిర్మించాడు నాగార్జున. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరాశ పరిచింది.
4. ఆర్జీవీ రామాయణం: రామ్ గోపాల్ వర్మను నమ్ముకుని సినిమాలు చేస్తే ఇంకేమైనా ఉందా..? ఒకప్పుడు వర్మతో సినిమా అంటే కనీసం యావరేజ్ అనే ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు ఆయన రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. అందుకే నాగార్జున కూడా ఈయన దర్శకత్వంలో నటించడానికి నో చెప్పాడు. దాదాపు పదేళ్ల కింద నాగార్జునతో రామాయణం అనే సినిమా చేయాలనుకున్నాడు వర్మ. కానీ దీనికి నిర్ధాక్ష్యణ్యంగా నో చెప్పాడు నాగార్జున.
5. నాన్ రుద్రన్: తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నాగార్జునకు మంచి ఇమేజ్ ఉంది. అక్కడ కూడా ఈయన సినిమాలు చేసాడు. 20 ఏళ్ల కిందే రక్షకుడు సినిమాతో తమిళ ప్రేక్షకులకు నేరుగా పరిచయం అయ్యాడు నాగార్జున. అయితే ఈ మధ్యే ధనుష్ తో చేయాల్సిన మల్టీస్టారర్ కు నో చెప్పాడు నాగార్జున. నాన్ రుద్రన్ పేరుతో ఈ సినిమా మొదలైనా.. ఆ తర్వాత పూర్తి కాలేదు.
6. మౌన రాగం: నాగార్జున కెరీర్ మొదట్లోనే ఓ క్లాసిక్ సినిమాను వదిలేయాల్సి వచ్చింది. అప్పటికి ఇండస్ట్రీకి వచ్చిన కొత్త కావడం.. కథలపై పెద్దగా పట్టు లేకపోవడంతో ఓ మంచి సినిమాను నాగార్జున చేజార్చుకున్నాడు. అదే మౌనరాగం. మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కానీ గీతాంజలితో అన్ని లెక్కలు ఒకేసారి సరి చేసాడు నాగార్జున.
7. కలిసుందాం రా: నాగార్జున చేతుల్లోంచి జారిపోయిన మరో బ్లాక్ బస్టర్ సినిమా కలిసుందాం రా. అప్పటికే వరసగా ఫ్యామిలీ సినిమాలు చేస్తున్న నాగార్జునకు దర్శకుడు ఉదయ్ శంకర్ కూడా అలాంటి కథనే నెరేట్ చేసాడు. అయితే ఆ సమయంలో అది రొటీన్ అనిపించడం.. తాను గతంలో చేసిన రాముడొచ్చాడు లాంటి కుటుంబ కథే కావడంతో నో చెప్పాడు. అదే సినిమాను వెంకటేష్ చేస్తే ఇండస్ట్రీ హిట్ అయింది.
8. బద్రి: పూరీ జగన్నాథ్ తొలి సినిమా హీరో పవన్ కళ్యాణ్. అయితే ఆయన కంటే ముందే బద్రి కథను నాగార్జునకు చెప్పాడు పూరీ. అసిస్టెంట్ గా ఉన్నపుడు నాగార్జునతో కలిసి పని చేసాడు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత వరసగా 30 రోజులు వెంబడించి మరీ పవన్ కళ్యాణ్ ను బద్రి సినిమాకు ఒప్పించి హిట్ కొట్టాడు పూరీ. అయితే ఆ తర్వాత నాగార్జునతో సూపర్, శివమణి లాంటి సినిమాలు చేసాడు ఈ దర్శకుడు.
9. పొన్నియన్ సెల్వన్: గీతాంజలి తర్వాత చాలా సినిమాలకు తన సినిమాల్లో నాగార్జుననే హీరోగా అనుకున్నాడు మణిరత్నం. అలా మహేష్ బాబు, నాగార్జునతో ఓ భారీ మల్టీస్టారర్ చేయాలనుకున్నాడు. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇదే కథను ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ పేరుతో చేస్తున్నాడు మణిరత్నం. కార్తి, శింబు లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
10. దళపతి: మణిరత్నం క్లాసికల్ బ్లాక్బస్టర్ దళపతి కథ కూడా ముందు నాగార్జున దగ్గరికి వచ్చింది. అప్పటికే గీతాంజలి సినిమా చేయడంతో నాగార్జున సత్తా తెలిసిన మణిరత్నం ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి చేయాలనుకున్నాడు. రజినీకాంత్ ను ఓ పాత్ర తీసుకుని.. మమ్ముట్టి కోసం నాగార్జునను అనుకున్నాడు. అయితే అనుకోని కారణాలతో ఈ సినిమా నుంచి నాగ్ తప్పుకోవాల్సి వచ్చింది.