విమాన ప్రమాదాలు తరుచుగా జరుగుతూనే ఉంటాయి. అందులో దేశంలోని ఎంతోమంది ప్రముఖులు ఇప్పటికే కన్నుమూసారు. తాజాగా ఇలాంటి దుర్ఘటన దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. తమిళనాడులోని జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Crash)లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ (Army Chief General Bipin Rawat), ఈ ఘోర ప్రమాదంలో బిపిన్ భార్య సహా 13 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది.
మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా.. ప్రమాదంలో కెప్టెన్ వరుణ్ సింగ్ గాయాలతో బయటపడ్డారు. మిగిలిన 13 మంది మరణించారు. అయితే ఇలాంటి అనుకోని ప్రమాదాలు సినీ ప్రముఖులను కూడా పొట్టన పెట్టుకున్నాయి. ప్రేక్షకులకు ఎంతో చేరువైన వాళ్లను ఘోరమైన విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు లోకం నుంచి తీసుకెళ్లిపోయాయి. అలా విమాన ప్రమాదాల్లో చనిపోయిన సినీ ప్రముఖులు ఎవరో చూద్దాం..
1. సౌందర్య: విమాన ప్రమాదం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సౌందర్య. ఎప్రిల్ 17, 2004లో బిజేపీ తరఫున ప్రచారం చేయడానికి వస్తున్న ఈమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో సౌందర్యతో సహా అన్న అమర్ కూడా అక్కడికక్కడే మరణించారు. చివరి చూపుకు సౌందర్య డెడ్ బాడీ కూడా దొరకనంతగా కాలిపోయింది. అప్పటికి ఆమె వయసు 31 సంవత్సరాలు.
2. జయన్: ఈయన పేరు తెలుగు ఇండస్ట్రీలో తెలిసి ఉండకపోవచ్చు కానీ మలయాళంలో మాత్రం సూపర్ స్టార్. 1970-80 మధ్య ఈయన ఓ యాక్షన్ హీరో. కేవలం 10 ఏళ్ళ కెరీర్లోనే 130 సినిమాల్లో నటించాడు జయన్. అయితే ఓ సినిమా షూటింగ్ కోసం హెలికాప్టర్ పైనుంచి రియల్ స్టంట్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవ శాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు జయన్. చనిపోయే నాటికి ఈయన వయసు కేవలం 41 ఏళ్ళు మాత్రమే.
3. తరుణి సచ్దేవ్: రస్నా బేబీగా దేశమంతా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిన్నారి తరుణి సచ్దేవ్. అమితాబ్ బచ్చన్ పా సినిమాలో కూడా నటించింది ఈమె. మే 14, 2012లో జరిగిన నేపాల్ విమాన ప్రమాదంలో తరుణి కూడా చనిపోయింది. దారుణం ఏంటంటే ఆ రోజు ఆమె పుట్టిన రోజు కూడా. అదే రోజు మరణించింది తరుణి. కేవలం 14 ఏళ్ళకే ఈ పాప మరణించింది. ఆమెతో పాటు ఈ ప్రమాదంలో తరుణి తల్లి కూడా చనిపోయింది.
4. రాణి చంద్ర: మలయాళంలో తనకంటూ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాణి చంద్ర కూడా 1976, 12 అక్టోబర్న జరిగిన విమానం ప్రమాదంలోనే చనిపోయారు. మిస్ కేరళగా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న రాణి చంద్ర సినిమాల్లోనూ రాణించారు. బాంబే నుంచి వస్తున్న సమయంలోనే ఈమె విమాన ప్రమాదంలో చనిపోయారు. అప్పటికి ఆమె వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే.