తెలుగు ఇండస్ట్రీలో హైయ్యస్ట్ సక్సెస్ రేట్ ఉన్న సీనియర్ హీరో వెంకటేష్. ఒకప్పుడు ఈయన నుంచి సినిమా వచ్చిందంటే చాలు కచ్చితంగా బాక్సాఫీస్ బద్దలైపోయేది. తనకున్న క్లాస్ ఫ్యామిలీ ఇమేజ్ తోనే ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకున్న ఘనత వెంకీ సొంతం. అలాంటి విక్టరీ వెంకటేష్ కొన్ని సినిమాలను వదిలేసుకున్నాడు. ఆయన కాదనుకున్న సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. అలా వెంకీ కాదనుకున్న సినిమాలు.. అతడి నుంచి అనుకోకుండా జారిపోయిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..
Gharshana: మణిరత్నం 'ఘర్షణ' సినిమా తీసినప్పుడు ముందు తెలుగు హీరోలను అనుకున్నాడు. అప్పుడప్పుడే హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటున్న వెంకటేష్,నాగార్జునతో ఈ సినిమా చేయాలని అనుకున్నాడు మణిరత్నం. కానీ వాళ్లు నో చెప్పేసరికి ఈ సినిమా కాస్తా వెంకీ చేతుల్లోంచి జారిపోయింది. అప్పుడు తమిళంలో బడ్డింగ్ హీరోలుగా ఉన్న ప్రభు,కార్తీక్ తో తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు మణిరత్నం. అలా ఆయన నుంచి ఘర్షణ మిస్ అయింది. కానీ విచిత్రంగా నాటి ఘర్షణ మిస్ అయినా.. అదే పేరుతో తర్వాత వెంకటేష్ సినిమా చేయడం యాదృశ్చికం.
Roja: అప్పట్లో మణిరత్నం తన ప్రతీ సినిమాకు ముందు తెలుగు హీరోలనే సంప్రదించేవాడు. అయితే ఆయన ఆలోచనలు మరీ పాన్ ఇండియన్ రేంజ్ లో ఉండటంతో మన హీరోలకు కాస్త భయం వేసేదంటారు విశ్లేషకులు. అలా వెంకటేష్ దగ్గరికి వచ్చిన కథ 'రోజా'. ఈ సినిమాను కూడా వెంకీతోనే చేయాలనుకున్నాడు మణి. కానీ ఈ సినిమాను కూడా వెంకటేష్ రిజెక్ట్ చేసాడు. ఆ సమయంలో తెలుగులో చంటి లాంటి సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు వెంకటేష్. ఈ సినిమా అరవింద్ స్వామి చేసి హిట్ కొట్టాడు.
Oke Okkadu: శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఒకే ఒక్కడు' సినిమా ముందు వెంకటేష్ కు వచ్చింది. అయితే ఆయన ఎందుకో మరి ఈ చిత్రం కాదనుకున్నాడు. ఆ తర్వాత అదే కథను మరో ఇద్దరు హీరోలకు కూడా చెప్పాడు శంకర్. ఎందుకో మరి కథను సరిగ్గా అంచనా వేయలేకపోయారో ఏమో కానీ ఒకే ఒక్కడు కథను మాత్రం వాళ్లు కాదనుకున్నారు. అయితే వెంకటేష్ మాత్రం అప్పుడు కలిసుందాం రా సినిమాతో బిజీగా ఉండటంతో దీన్ని కాదనుకున్నాడు. అదే సినిమాను అర్జున్ తో తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు శంకర్.
Santosham: కుటుంబ కథా చిత్రాలు చేయాలంటే ఒకప్పుడు శోభన్ బాబు.. ఆ తర్వాత వెంకటేష్ బాబు. అందుకే దర్శకులు కూడా ఈయనతో అలాంటి సినిమాలే చేయించారు. అదే సమయంలో సంతోషం సబ్జెక్ట్ ముందు వెంకీకే చెప్పాడు దర్శకుడు దశరధ్. అయితే అప్పటికే ఆ తరహా కథలు చేయడంతో 'సంతోషం' కథకు నో చెప్పాడు వెంకటేష్. ఈయన కాదన్న సినిమాను నాగార్జున చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పటికీ సంతోషం నాగార్జున కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.
Krishnam Vande Jagadgurum: రానా హీరోగా క్రిష్ తెరకెక్కించిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలోనూ ముందు వెంకటేష్ హీరో అనుకున్నారు. కథ కూడా చెప్పాడు.. నచ్చింది. అయితే చివరి నిమిషంలో మరో సినిమా రావడంతో వెంకీ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. అలా వెంకటేష్‌ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్న 'కృష్ణం వందే జగద్గురుం' సినిమా ఆఖరి నిమిషంలో రానా చేతిలోకి వెళ్ళింది. అయితే అది అంతగా ఆడలేదు. విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ విజయం సాధించలేదు. కానీ అదే సినిమాలో వెంకటేష్ ఓ సాంగ్‌లో కనిపించాడు.
Govindudu Andarivadele: ఫ్యామిలీ సినిమాలు చేయడంలో ఎక్స్పర్ట్ అయిన కృష్ణవంశీ.. తాను రాసుకున్న తరతరాల గోవిందుడు అందరివాడేలే సినిమా కథను ముందు వెంకటేష్‌కు చెప్పాడు. అందులో రామ్ చరణ్ బాబాయ్ పాత్రలో ముందు వెంకీనే అనుకున్నారు. అయితే ఆయన సైడ్ కారెక్టర్ అని నో చెప్పాడు. ఆ తర్వాత ఆ పాత్రను శ్రీకాంత్ చేసాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ నటనకి మంచి పేరు వచ్చింది. వెంకటేష్ మాత్రం ఈ సినిమాను కావాలనే వదిలేసుకున్నాడు.
Radha: మారుతి దర్శకత్వంలో రాధా అనే సినిమాను ముందు అనౌన్స్ చేసి ఆ తర్వాత ఆపేసాడు వెంకటేష్. కథ నచ్చి పొలిటికల్ ఫార్మాట్లో ఈ కథ వస్తుందని చెప్పాడు వెంకీ. దీనికోసం పోస్టర్ డిజైన్స్ కూడా వేసిన తర్వాత నో చెప్పాడు. అలా పట్టాలెక్కాల్సిన రాధా కాస్త అటకెక్కింది. అయితే అదే మారుతితో రెండేళ్ల తర్వాత బాబు బంగారం సినిమా చేసాడు వెంకటేష్. ఇది యావరేజ్‌గానే ఆడింది.
Savitri: సీనియర్ దర్శకుడు తేజ స్టార్ హీరోలతో సినిమా చేయనంటూ ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. వాళ్లతో చేస్తే కచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తాయని.. వాళ్ల ఇమేజ్‌కు తన కథలు అడ్డొస్తాయని చెప్తుంటాడు. అయినా కూడా ఓ సారి ఎందకు మరి వెంకటేష్‌కు కథ చెప్పడానికి ప్రయత్నించాడు. అలా సావిత్రి కథ పుట్టింది. పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చిన తర్వాత సావిత్రిని పక్కనబెట్టేసారు వెంకటేష్.
Krack: రవితేజ బ్లాక్ బస్టర్ సినిమా క్రాక్ కథ కూడా ముందు వెంకటేష్ కు చెప్పాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. అప్పటికే బాడీగార్డ్ సినిమా ఈ కాంబినేషన్ లోనే వచ్చింది. ఆ పరిచయంతోనే వెంకీకి కథ నెరేట్ చేసాడు. అయితే ఎందుకో మరి క్రాక్ కథ వెంకీకి కనెక్ట్ కాలేదు. దాంతో సినిమా కూడా పట్టాలెక్కలేదు. అయితే అదే కథను రవితేజతో చేసి సూపర్ హిట్ కొట్టాడు గోపీచంద్ మలినేని.
Adavallu Meeku Joharlu: లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న వెంకటేష్ తో అలాంటి సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు దర్శకులు కూడా. ఈ క్రమంలోనే ఆడవాళ్లు మీకు జోహార్లు అనే ఫ్యామిలీ సబ్జెక్ట్ వెంకీ దగ్గరికి తీసుకొచ్చాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ కథ వెంకీకి నచ్చింది కూడా. కానీ ఎందుకో తెలియదు కానీ చేయలేకపోయాడు. ఇదే కథను శర్వానంద్, రష్మిక మందన్న జంటగా చేసాడు కిషోర్. ఈ సినిమా మొన్న మార్చ్ 4న విడుదలైంది.