కరోనా వచ్చిన తర్వాత ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయి. అందుకే నిర్మాతలు కూడా సినిమాలు విడుదల చేసే విధానాలను మార్చుకున్నారు. ఒకప్పట్లా థియేటర్స్ కోసమే వేచి చూడటం లేదు. మంచి ఆఫర్ వస్తే ఓటిటికి ఇచ్చేస్తున్నారు. 2020లోనే ఈ ఆనవాయితీ మొదలైపోయింది. నాని, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను నేరుగా డిజిటల్ మీడియాలో విడుదల చేసారు. 2021లోనూ అదే కంటిన్యూ అయింది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమా కూడా బయట పరిస్థితులు బాగోలేక నేరుగా ఓటిటిలో వచ్చింది. జై భీమ్ లాంటి సినిమాలు సంచలన విజయం అందుకున్నాయి. అలా 2021లో అన్ని భాషల్లో వచ్చిన ది బెస్ట్ ఓటిటి సినిమాలేంటో చూద్దాం..
నారప్ప: వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం.. 2019లో వచ్చిన తమిళ చిత్రం అసురన్ రీమేక్. వెంకటేష్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇదే సినిమాను నారప్ప పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. ముందు నుంచి కూడా ఈ సినిమాను థియేటర్స్ కోసం వెయిట్ చేయకుండా ఓటీటీలోనే విడుదల చేసారు. దీనికి ఓటిటిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకీ మేకోవర్, నటనకు ప్రశంసలు దక్కాయి.
దృశ్యం 2 (మలయాళం): 2021లో వచ్చిన ది బెస్ట్ ఓటిటి సినిమాలలో కచ్చితంగా ఉండే సినిమా దృశ్యం 2. మలయాళంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకుడు. ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏడాది చివర్లో నవంబర్ 25న తెలుగు వర్షన్ కూడా నేరుగా డిజిటల్లోనే విడుదలైంది. వెంకటేష్, మీనా ఇక్కడ జంటగా నటించారు.
టక్ జగదీష్: 2020లో వి సినిమాతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని.. ఈ ఏడాది టక్ జగదీష్ సినిమాతో అలాగే వచ్చాడు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా కూడా అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాకు మంచి వ్యూస్ వచ్చాయి. సినిమాను దాదాపు 35 కోట్లకు పైగానే ఓటిటికి అమ్మేసారు.
మాస్ట్రో: నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సినిమా మాస్ట్రో. హిందీ బ్లాక్‌బస్టర్ అందాధూన్ సినిమాకు రీమేక్ ఇది. అక్కడ ఆయుష్మాన్ ఖురానాకు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన పాత్రలో నితిన్ నటించాడు. ఉన్నదున్నట్లు ఈ సినిమాను తెరకెక్కించాడు గాంధీ. తెలుగులో తమన్నా విలన్‌గా నటించగా.. నభా నటేష్ హీరోయిన్. హాట్ స్టార్ డిస్నీలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఏక్ మినీ కథ: యువీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ యువీ కాన్సెప్ట్స్ నుంచి వచ్చిన సినిమా ఏక్ మినీ కథ. మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ సినిమాకు కార్తిక్ రాపోలు దర్శకుడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమాలో కావ్య తప్పర్ అందాలు అదనపు ఆకర్షణ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
అద్భుతం: 2021లో ఓటిటి బెస్ట్ రిలీజ్‌లలో ఒకటి అద్బుతం. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంతోనే రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ హీరోయిన్గా పరిచయం అయింది. ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ చిత్రం టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చింది. హాట్ స్టార్ డిస్నీలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
జై భీమ్: 2021లో ఎన్ని సినిమాలు ఓటిటిలో విడుదలైనా కూడా ఒక్క బెస్ట్ సినిమా పేరు చెప్పమంటే ముందుగా అందరూ చెప్పే పేరు జై భీమ్. 2020లో ఆకాశమే నీ హద్దురా లాంటి సెన్సేషనల్ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసిన సూర్య.. ఈ ఏడాది జై భీమ్ అంటూ వచ్చాడు. చెంచుల జీవితాలపై జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
రాధే: సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాకు కూడా ఓటిటి రిలీజ్ తప్పలేదు. ముందుగా ఈద్ కానుకగా రాధే సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికే కరోనా కారణంగా మూత పడటంతో మరో ఆప్షన్ లేక జీ స్టూడియోస్‌లో ఈ సినిమాను నేరుగా విడుదల చేసారు. ప్రభుదేవా తెరకెక్కించిన రాధేకు డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా.. వ్యూస్ మాత్రం రికార్డు స్థాయిలో వచ్చాయి.
మిన్నల్ మురళి: ఏడాది చివర్లో నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలైన మలయాళ సినిమా మిన్నల్ మురళి. టివోనో థామస్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇండియన్ వైడ్‌గా ఈ సూపర్ హీరో సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్. క్రిస్మస్ కానుకగా విడుదలైన మిన్నళ్ మురళి ఓటిటి బెస్ట్ సినిమాస్‌లో ఒకటిగా నిలిచింది.