తెలుగు ప్రేక్షక లోగిళ్లలో సంగీత పూవనం పూయించిన అద్భుతమైన పాటల కార్యక్రమం పాడుతా తీయగా. ఆరేళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ల వరకు పాడుతా తీయగా అంటే ప్రత్యేకమైన అభిమానం. అందులో ఎస్పీ బాలు గళం వింటే అదో తెలియని మధురానుభూతి. ఈ ఒక్క కార్యక్రమంతో తెలుగు ఇండస్ట్రీకి వందల మంది గాయనీ గాయకులు పరిచయం అయ్యారంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో అత్యధిక కాలం పాటు నిర్విరామంగా కొనసాగిన సంగీత కార్యక్రమం ఇదే.
ఎంతోమంది యువ గాయకుల సంగీత లొగిలిగా నిలిచింది ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం. 25 ఏళ్ల క్రితం బాలు చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ సంగీత యజ్ఞం. ఇప్పటి వరకు విజయవంతంగా 18 సీజన్స్ అప్రతిహతంగా సాగింది. ఈ స్వరయజ్ఞంలో ఎంతోమంది వేలాది మంది ప్రతిభావంతులను తెలుగు తెరతో పాటు సమాజానికి పరిచయం చేసింది ఈ వేడుక. ఎస్పీ బాలు ఉన్నపుడు పాడుతా తీయగా అంటే అదో బ్రాండ్. కానీ ఆయన అర్ధాంతరంగా మరణించిన తర్వాత ఈ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఎందుకంటే బాలు లేని పాడుతా తీయగాను ఊహించుకోవడం కూడా కష్టమే. అయితే ఈటీవీ సంస్థ త్వరలోనే 19వ సీజన్ మొదలు పెట్టనుంది. పాడుతా తీయగా కోసం ఈటీవీ భారీ కసరత్తు మొదలు పెట్టింది. కరోనా దృష్ట్యా ఆన్లైన్ ఆడిషన్స్ నిర్వహించింది. 4 వేల మంది గాయనీ గాయకుల స్వరాలను న్యాయ నిర్ణేతలు పరీక్షించి అందులో నుంచి 16 మంది అద్భుతమైన స్వర కళాకారులను ఎంపిక చేశారు.
మరికొన్ని రోజుల్లోనే వీనుల విందుగా ఈటీవీ బుల్లితెరపై పాడుతా తీయగా తాజా సీజన్ ప్రసారం కానుంది. ఈ రియాలిటీ షో నిర్వహించే బాధ్యతను దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ స్వీకరించటం విశేషం. ఆయన వారసుడికే ఈ బాధ్యతలు అప్పగించడంతో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. దీనికి సింబాలిక్‌గా బాలు తొలి వర్థంతి సెప్టెంబర్ 25న రామోజీరావు చేతుల మీదుగా చరణ్ మైక్‌పీస్ అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి చంద్రబోస్, సునీత, విజయ్ ప్రకాష్ లాంటి మేటి గాయకులు, రచయిలు జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు. ఇందులో పాల్గొన్న గాయకులకు తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ చేయూతగానే ఉంటుంది.. చేతులు అందిస్తూనే ఉంటుంది. ఎప్పట్నుంచో టాలీవుడ్లో ఉన్న ఉష, హేమచంద్ర, కారుణ్య, రామాచారి, మాళవిక, కౌసల్య, స్మిత, కె.ఎం.రాధాకృష్ణ, గోపికా పూర్ణిమా, సాహితి, దామిని, మల్లిఖార్జున్ లాంటి ఎందరో గాయకులు ఈటీవీ పాడుతా తీయగా నుంచి వచ్చిన వాళ్లే.
వాళ్ల స్వర జ్ఞానానికి ఎస్పీ బాలు దగ్గరే పునాదులు పడ్డాయి. అందుకే పాతికేళ్ల నుంచి ఈ కార్యక్రమం నిరంతరాయంగా ప్రసారం అవుతూనే ఉంది. వేలాది యువ గొంతుకలు అలనాటి పాటలను స్వరాలతో మీటుతూంటే యాంకర్‌గా ఎస్పీ బాలు సమయోచితంగా, సందర్భోచితంగా పాట వెనుక మాటలను గుర్తు చేస్తూండేవాళ్ళు. వాటితో తనకున్న అనుబంధాన్ని నేటి గాయకులతో పంచుకుని.. రెండు తరాలకు వారధిలా ఉండేవాళ్లు.