కొన్నేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం ఎవరూ అంత ఈజీగా మరిచిపోలేరు. చిన్న పెద్దా అని తేడా లేకుండా చాలా మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటుల, దర్శకుల చుట్టూ డ్రగ్స్ రాకేట్ ఉచ్చు బిగుసుకుంది. అందులో స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఉండటం సంచలనంగా మారింది. ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ మాఫియా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలకి కూడా పాకింది.
కన్నడలో అయితే ఏకంగా సంజన, రాగిణి ద్వివేది లాంటి హీరోయిన్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో టాలీవుడ్లో కూడా కొంత మంది నటీనటులు కొంత మంది విదేశీయలు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దానిపై అప్పట్లో చాలా పెద్ద విచారణ కూడా జరిగింది. నెల రోజుల పాటు వరసగా విచారించారు. ఒక్కొక్కొరని రెండు మూడు సార్లు కూడా విచారించారు అధికారులు.
ఈ కేసులో పోలీసులు పలుకుబడి ఉన్న పెద్ద తలకాయలను ఒదిలిపెట్టి.. చిన్న చిన్న ఆర్టిస్టులపై ఎక్కువ ఫోకస్ చేసారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఏడాదిన్నరగా ఎలాంటి సందడి లేని ఈ కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది.
దాంతో టాలీవుడ్లో మళ్లీ డ్రగ్స్ ప్రకంపనలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. ఈడీ రంగంలోకి దిగడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. విచారణకు హాజరు కావాలంటూ హీరోయిన్లు ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్.. హీరోలు రవితేజ, రానా, తరుణ్, నవదీప్.. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు నందు, శ్రీనివాస్, ముమైత్ ఖాన్ సహా మరికొందరికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఈ విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. మరి ఇప్పుడు జరగబోయే విచారణలో ఎలాంటి నిజాలు బయటికి రాబోతున్నాయో..?