రైతుబంధులాంటి అద్భుతమైన పథకం దేశంలో ఎక్కడా లేదని.. ఇది రైతుల ఆర్థిక స్థితిగతులను మార్చేస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ ఈ ప్రతిష్టాత్మక పథకంపై ముందు నుంచీ విమర్శలున్నాయి. పేద రైతులకు ఇస్తే ఓకే కానీ.. వందల కోట్ల ఆస్తులున్న సంపన్నులకు ఎందుకు ఇస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కూడా రైతుబంధు పథకాన్ని టార్గెట్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లో జరిగిన ఓ సదస్సులో మాట్లాడిన ఆయన.. రైతుబంధు పథకాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వందల ఎకరాలు ఉన్న ధనవంతులకు రైతుబంధు డబ్బులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణలోని రైతులకు వానాకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి ఐదు వేల చొప్పున మొత్తం 10వేల రూపాయలను ఇస్తున్నారు. వందల ఎకరాల భూమి ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుండడంతో.. వారికి ఏటా లక్షల రూపాయలు వస్తున్నాయి. వ్యవసాయం చేయని సంపన్నులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా డబ్బులు తీసుకుంటున్నారని ఆకునూరి మురళి అన్నారు.