అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వా గుర్తించాల్సిన అవసరం లేదు. ఖలేజా సినిమా కోసం త్రివిక్రమ్ రాసిన ఈ డైలాగ్ బొమ్మరిల్లు సినిమాకు పక్కాగా సరిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా తీసేముందు అదొక అద్భుతం అని ఎవరూ అనుకోలేదు. నిజానికి సినిమా తీసిన దిల్ రాజు.. రాసిన భాస్కర్ కూడా బొమ్మరిల్లు ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించి ఉండరేమో..?
మంచి సినమా చేస్తున్నామనే ఊహల్లోనే ఉండుంటారు కానీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ అరుదైన సినిమా చేస్తున్నామని వాళ్లకప్పుడు అస్సలు తెలిసుండదు. అందుకే బొమ్మరిల్లు విడుదలై 15 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అంతెందుకు ఈ సినిమా చేసిన దర్శకుడు భాస్కర్.. ఇప్పటికీ మళ్లీ బొమ్మరిల్లు లాంటి విజయం అందుకోలేకపోయాడు.
ఈ సినిమా కథ రాసుకున్నపుడు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లలో ఎవరో ఒకర్ని ఇందులో నటించడానికి ఒప్పించాలని చూసాడు భాస్కర్. అయితే ఈ కథ జూనియర్ ఎన్టీఆర్‌కు కనెక్ట్ కాలేదు. ఇంత సాఫ్ట్ కథ తనకు సూట్ అవ్వదని పక్కకు వచ్చేసాడు. అయితే అల్లు అర్జున్‌కు కథ నచ్చినా కూడా అప్పుడున్న కమిట్మెంట్స్ కారణంగా చేయలేకపోయాడు. అందుకే భాస్కర్ విజన్ నచ్చి వెంటనే పరుగు అవకాశం ఇచ్చాడు అల్లు అర్జున్.
అలా పరిస్థితుల కారణంగా బన్నీ చేతుల్లోంచి.. కథ నచ్చక జూనియర్ చేతుల్లోంచి బొమ్మరిల్లు సినిమా జారిపోయింది. చివరికి అది సిద్ధూ చేతుల్లోకి వచ్చింది. అది ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత తెలిసింది.. పడాల్సిన వాళ్లకే ఈ సినిమా పడింది.. రావాల్సిన వాళ్ల దగ్గరికే కథ వచ్చిందని. ఈ సినిమా టైటిల్ విషయంలోనూ చిన్న కథ ఉంది.
ఆ సినిమా సమయంలోనే బొమ్మరిల్లు బ్యానర్ స్థాపించి దేవదాసు సినిమా తెరకెక్కించాడు వై.వి.యస్.చౌదరి. బొమ్మరిల్లు టైటిల్ బాగుంది అని దిల్ రాజు అదే ఓకే చేశాడు. 120 రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని సెట్స్‌పైకి వెళ్లిన బొమ్మరిల్లు 105 రోజుల్లో పూర్తైపోయింది. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను 9 కోట్లకు అమ్మాడు దిల్ రాజు. చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నాడు.
విడుదలైన తర్వాత దాదాపు 23 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రకాష్ రాజ్, జయసుధ క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోయాయి. హాసినిగా జెనీలియా చేసిన పర్ఫార్మెన్స్ అద్భుతం. ఓవర్సీస్ మార్కెట్ ఓపెన్ చేసిన తొలి తెలుగు సినిమా బొమ్మరిల్లు కావడం విశేషం. ఆ రోజుల్లోనే ఈ సినిమా ఓవర్సీస్ నుంచి దాదాపు 3 కోట్లు వసూలు చేసింది.