విజే సన్నీ.. ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతుంది. దానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయిన బిగ్ బాస్ 5 తెలుగు విజేతగా నిలిచాడు సన్నీ. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టించాడు ఈయన. ఎక్కడ్నుంచి వచ్చాడో తెలియదు.. బ్యాగ్రౌండ్ లేదు.. స్టార్ అంతకంటే కాదు.. అయినా కూడా ఇప్పుడు విన్నర్ అయ్యాడు విజే సన్నీ. ఈయన హాట్ టాపిక్ అయ్యాడిప్పుడు.
తన ఆటిట్యూడ్, ఎమోషన్, కోపం, మాస్కులు లేని మంచితనంతోనే ఈ సీజన్ విజేతగా నిలిచాడు సన్నీ. ఈయన విన్నర్ అయిన విషయం తెలియగానే.. ఎవరు ఈయన అంటూ ఆరా తీస్తున్నారు. సన్నీ క్రేజ్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. అందుకే సోషల్ మీడియా కూడా సన్నీ నామస్మరణతో షేక్ అయిపోతుంది. ఈయన బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకోవాలని తెగ సర్చ్ చేస్తున్నారు.
ఇంతకీ అసలు ఎవరీ VJ సన్నీ.. మనోడి బ్యాగ్రౌండ్ ఏంటి..? మోడల్‌గా తన మొదలు పెట్టాడు సన్నీ. ఆ తర్వాత జర్నలిస్టుగానూ ఉన్నాడు. ఓ న్యూస్ ఛానెల్లో కొన్నాళ్ల పాటు పని చేసాడు సన్నీ. ఆ తర్వాత వీజేగా చాలా ఏళ్ళు కెరీర్ కొనసాగించాడు. ఈయన జర్నీ అక్కడ కూడా విజయవంతంగా ముందుకు నడిచింది. ఆ తర్వాత యాంకర్ కూడా అయ్యాడు సన్నీ. విజే, రియాలిటీ షోలు మాత్రమే కాకుండా టీవీలో కూడా మనోడు బాగానే పరిచయం.
కొన్ని షోలు సన్నీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇలా వచ్చిన ఫేమ్తోనే సన్నీకి సీరియల్స్‌లో అవకాశం దక్కించుకున్నాడు. ముఖ్యంగా కళ్యాణ వైభోగమే సీరియల్‌తో మంచి పేరు రావడంతో వీజే సన్నీ కాస్తా నటుడిగా మారిపోయాడు. సన్నీకి లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. సీరియల్స్‌లో నటించేటప్పుడు ఈయనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అంతేకాదు ఈయనకు బుల్లితెర జూనియర్ ఎన్టీఆర్ అని పేరు కూడా ఉంది.
సీరియల్స్ మాత్రమే కాదు.. కొన్ని సినిమాలు కూడా చేసాడు సన్నీ. సకలగుణాభిరామ అనే సినిమాలో ఈయన నటించాడు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా చేసాడు. ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్‌లోకి వచ్చాడు. ఇంట్లోకి అడుగు పెట్టే వరకు కూడా సన్నీ గురించి చాలా మందికి ఐడియా లేదు. సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళకు మాత్రమే సన్నీ పరిచయం కానీ మిగిలిన వాళ్లకు కాదు.
ఇంట్లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్‌తో పోలిస్తే సన్నీకి ఫాలోయింగ్ తక్కువగానే ఉంది. అయితే హౌజ్‌లోకి వచ్చిన తర్వాత సన్నీ అందరికీ నచ్చడం మొదలుపెట్టాడు. సగం సీజన్ అయ్యే వరకు కూడా సన్నీకి అంతగా ఫాలోయింగ్ లేదు. విన్నర్ అవుతాడనే నమ్మకాలు కూడా లేవు. కానీ టాస్క్‌లు ఆడుతున్న తీరుతో పాటు ఎమోషన్ పండించడం.. ఎంటర్టైన్మెంట్ చేయడంలో సన్నీ ఆరితేరిపోయాడు.
పైగా ఎవరితో గొడవ అయినా కూడా వెంటనే కాసేపటి తర్వాత వెళ్లి పలకరించి కూల్ చేసేవాడు. తప్పు తనదైతే సారీ చెప్పేవాడు. ఎవరైనా బాధ పడితే తట్టుకోలేడు. ఏదైనా ఉంటే మొహం మీదే చెప్పేస్తాడు గానీ కుట్రలు చేయడం.. దొంగదెబ్బ తీయడం లాంటి అస్సలు సన్నీకి తెలియవు. ఈ జెన్యూనిటీనే సన్నీని బిగ్ బాస్ విజేతగా నిలబెట్టింది. మొత్తానికి జీరో నుంచి మొదలై ఇప్పుడు హీరో అయ్యాడు సన్నీ.