ట్రిపుల్ ఆర్ పుణ్యమా అని దేశమంతా ఇప్పుడు రాజమౌళి పేరు మార్మోగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది. దాంతో దర్శక ధీరుడి గురించి ఇంకా తెలియని విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు అభిమానులు.. ప్రేక్షకులు. ఈ క్రమంలోనే వాళ్లకు అనుకోని విషయాలు తెలుస్తున్నాయి. ఈయన కెరీర్లో రెండు సినిమాలు మొదలుపెట్టి ఆపేసాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఏంటి.. రాజమౌళితో సినిమా మొదలు పెట్టిన తర్వాత ఆపేసిన నిర్మాతలు, హీరోలున్నారా..? అసలు మొదలు పెట్టిన సినిమాను ఎన్నేళ్లైనా కూర్చుని పూర్తి చేసే అలవాటున్న రాజమౌళి.. ఓ సినిమా అనుకుని.. ఐడియా దగ్గరే ఆగిపవడం జరుగుతుందా..? అసలు అయ్యే పనేనా అది అనుకుంటున్నారు కదా..? కానీ అది జరిగింది.. ఈయన కెరీర్లో నిజంగానే రెండు సినిమాలు అనుకున్న తర్వాత ఐడియా దగ్గరే ఆగిపోయాయి. అయితే ఇది ఇప్పుడు కాదు.. కెరీర్ కొత్తలో ఒకప్పుడు జరిగింది.
ఓటమి ఎరుగని దర్శక ధీరుడు కూడా ఒకానొక సమయంలో కొన్ని సినిమాల విషయంలో వెనకడుగు వేయక తప్పలేదు. మరీ ముఖ్యంగా ఒక సినిమా అయితే పట్టాలెక్కినట్టే ఎక్కి అర్ధాంతరంగా ఆగిపోయాయి. జక్కన్న ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే.. ఆరు నూరైనా దాన్ని పూర్తి చేస్తాడు. దానికి పర్ఫెక్ట్ రూపం ఇచ్చే వరకు వదలడు. ఎన్ని రోజులైనా.. ఎంత ఆలస్యమైనా అనుకున్న పని పూర్తి చేసి కానీ కదలడు. అలాంటి దర్శకుడు రెండు సినిమాల విషయంలో మాత్రం వద్దులే అని నిర్ణయం మార్చుకున్నాడు.
2001లో స్టూడెంట్ నెం 1 సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన జక్కన్న.. ఆ తర్వాత వరసగా 11 విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు విడుదలైన ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా మంచి రివ్యూస్ వస్తున్నాయి. ప్రేక్షకులు మరోసారి బ్రహ్మరథం పట్టేలా కనిపిస్తున్నారు. అయితే అప్పట్లో ఈయన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో ఓ మైథలాజికల్ డ్రామాని అనుకున్నాడు. భారీ బడ్జెట్‌తోనే ఈ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు.
దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే అంతలోనే ఏమైందో తెలీదు కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకముందే ఆగిపోయింది. ఆ తర్వాత తన గురువు రాఘవేంద్రరావు తనయుడు కేఎస్ ప్రకాష్‌ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలనుకున్నాడు. దానికి కూడా ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టిన తర్వాత ఆపేసాడు. అది కూడా ఓ ప్రేమకథ చేయాలనుకున్నాడు.. కానీ కుదర్లేదు.
పైగా అంతకుముందు కేఎస్ ప్రకాష్ హీరోగా నటించిన ‘నీతో’ అనే సినిమా డిజాస్టర్ అయింది. కనీసం ఆ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు. అలాంటి హీరోతో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తే రిస్క్ అని జక్కన్న ఆ సినిమాను డ్రాప్ చేసాడు. అలా కెరీర్ ప్రారంభంలోనే రెండు సినిమాలు అనుకుని డ్రాప్ అయ్యాడు దర్శక ధీరుడు.