మురుగదాస్… ఈయన పేరు చెబితే చాలు, ఈయన తీసిన పలు అద్భుతమైన సినిమాలు మన కళ్ల ముందు మెదులుతాయి. నేటి తరం దర్శకుల్లో తనకంటూ ఓ వైవిధ్యతను, విభిన్నమైన శైలిని కలిగి ఉన్న ఫేమస్ డైరెక్టర్ ఈయన. ఇప్పుడంటే ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు రోజుల తరబడి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ, నిజానికి మురుగదాస్ ఒకప్పుడు.. అంటే.. సినిమాలకు పనిచేయకముందు చాలా కష్టాలు అనుభవించాడు తెలుసా..?
మురుగదాస్ తండ్రి పేరు అరుణాచలం. తండ్రి కూలి పని చేసేవాడు. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించేవాడు. అయితే మురుగదాస్‌కు చిన్నప్పటి నుంచి పుస్తకాలు, సినిమాలు అంటే చాలా ఆసక్తి. తనకు కనిపించే చిన్న పేపర్ ముక్కను అయినా విడిచిపెట్టకుండా చదివేవాడు. తనకు లభించే డబ్బుతోనే నేల టిక్కెట్ కొని సినిమాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఎలాగో డిగ్రీ చదివిన మురుగదాస్ సినిమాల్లో పనిచేసేందుకు చెన్నై చేరుకున్నాడు.
చెన్నై చేరుకున్నప్పుడు మురుగదాస్ వద్ద డబ్బులు లేవు. ఇంటి దగ్గర్నుంచి అతనికి నెలకు రూ.500 పంపేవారు. వాటితోనే అతను సరిపెట్టుకునేవాడు. కేవలం రోజుకు ఒక పూట మాత్రమే తిండి తినేవాడు. కొన్ని నెలలు అలా గడిపినా ఇంటి దగ్గర్నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయాయి. మరో వైపు ఇంటి అద్దె కట్టి ఆరు నెలలు అయింది. దీంతో ఏం చేయాలో తెలియలేదు.
ఓ స్నేహితుని వల్ల బట్టలుతికే పని చేసేవాడు. ఒక ప్యాంటు లేదా చొక్కాకు రూ.1 తీసుకుని బట్టలు ఉతికేవాడు. ఆ పనిచేస్తుండగా మురుగదాస్ ఇంటి ఓనర్ చూసి చలించిపోయాడు. మరో 6 నెలలు అద్దె కట్టకున్నా ఏమీ అనను, కానీ ఆ పని చేయకు అని మురుగదాస్‌ను అతను బతిమాలాడాడు. దీంతో మురుగదాస్ ఆ పని మానేశాడు. తన రూం ఓనర్ సహాయంతో అమృతం అనే రైటర్ వద్ద పనిలో చేరాడు. ఎన్నో సినిమాలకు పనిచేశాడు. దీంతో సినిమా ఇండస్ట్రీలో మురుగదాస్‌కు పరిచయాలు పెరిగాయి.
క్రమంగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ప్రారంభించాడు. ఎస్జే సూర్య దగ్గర వాలి, ఖుషి సినిమాలు చేశాడు. వాలి సినిమాతో హీరో అజిత్‌తో స్నేహం అయింది. దీంతో అతనితో గజిని సినిమా తీద్దామనుకున్నాడు. కానీ డేట్స్ ఖాళీ లేక సూర్యతో ఆ సినిమా చేశాడు. ఇక గజిని హిట్ అవడంతో మురుగదాస్ వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో అవకాశాలు అతని తలుపుతట్టాయి.
వాటిని అతను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో హిందీ వెర్షన్లో అమీర్‌ఖాన్‌తో గజిని తీసి అటు బాలీవుడ్‌కు కూడా దగ్గరయ్యాడు. అమీర్‌ఖాన్ మాత్రమే కాదు, ముఖేష్ అంబానీ అంతటి వ్యక్తి మురుగదాస్‌ను ఇంటికి రప్పించుకుని అతనితో కలిసి గజిని సినిమా చూశారు. మురుగదాస్‌తో కలిసి డిన్నర్ చేశారు. అలా మురుగదాస్ ఒక టాలెంటెడ్ డైరెక్టర్‌గా ఎదిగాడు.