కరోనా కారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే ఓటిటి బాట పడుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు నటించిన సినిమాలను కూడా నేరుగా డిజిటల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. సూర్య ఇప్పటికే ఆ దారిలోనే ఉన్నాడు. ఇప్పుడు విక్రమ్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయనకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడ కూడా ఆయన సినిమాలకు మార్కెట్ ఉంది.
అపరిచితుడు సినిమాతో టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ స్థాయి విజయం ఈయనకు రాలేదు. కానీ విక్రమ్ నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ విడుదలవుతూ వచ్చాయి. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. తమిళంలో కూడా కమర్షియల్ విజయం అందుకుని చాలా రోజులు అయిపోయింది. అక్కడ కూడా 15 ఏళ్ళుగా విక్రమ్ సరైన బ్లాక్‌బస్టర్ కోసం చూస్తూనే ఉన్నాడు.
అయినా కూడా ఈయనకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు విక్రమ్. ఇదిలా ఉంటే ఈయన తన రాబోయే సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సూర్య దారిలోనే విక్రమ్ కూడా నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. థియేటర్స్‌లో విడుదలైన సినిమాలకు ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు. అందుకే మంచి ఓటిటి రేటుకు తన సినిమాలను ఓటిటికి ఇచ్చేస్తున్నాడు విక్రమ్.
ఇప్పటికే తమిళంలో ధనుష్, సూర్య లాంటి స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను డిజిటల్ రిలీజ్ చేసారు. సూర్య అయితే వరసగా రెండు సినిమాలను అక్కడే విడుదల చేసి క్యాష్ చేసుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు ఓటిటిలో అద్భుతమైన విజయం అందుకున్నాయి. దాంతో పాటు ధనుష్ జగమే తంత్రంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్య సార్పట్ట అదిరిపోయే వ్యూస్ అందుకుంది.
ఇప్పుడు విక్రమ్ కూడా వెళ్లాలనుకుంటున్నాడు. ఈయన నటిస్తున్న ‘మహాన్’ నేరుగా ఓటీటీలో విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 10న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కార్తీక్ సబ్బురాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విక్రమ్‌తో పాటు ఆయన తనయుడు ధృవ్ కూడా నటిస్తున్నాడు. కార్తీక్ గత సినిమా జగమే తంత్రం కూడా ఓటిటిలోనే విడుదలైంది. ఇప్పుడు మహాన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది.
యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించాడు కార్తీక్ సుబ్బరాజ్. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. పైగా తండ్రీ కొడుకులు కలిసి నటించిన సినిమా కావడంతో విక్రమ్ అభిమానుల్లోనూ మహాన్పై అంచనాలు బాగానే ఉన్నాయి. దాంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో థియేటర్స్ కాకుండా నేరుగా డిజిటల్ మీడియాలోనే మహాన్ సినిమాను తీసుకొస్తున్నారు.
మరోవైపు ‘కోబ్రా’ సినిమాను కూడా మార్చిలో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాను అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్నాడు. మరి సూర్య దారిలోనే విక్రమ్ కూడా విజయం అందుకుంటాడా లేదా చూడాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం.. విక్రమ్ లాంటి స్టార్ హీరో కూడా తన సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చేస్తుండటంతో థియేటర్స్ యాజమాన్యం ఆయనపై కూడా అసంతృప్తిగా ఉండటం ఖాయం.