‘నేను ఇండస్ట్రీ పెద్ద కాదు.. నాకు అవ్వాలని కూడా లేదు.. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు.. కానీ బాధ్యతగా ఉంటా.. అవసరం అనుకున్నపుడు కచ్చితంగా ముందుకొస్తా.. ఇండస్ట్రీకి అండగా ఉంటా’.. ఇవి ఈ మధ్య ఓ ప్రెస్ మీట్లో భాగంగా చిరంజీవి మాట్లాడిన మాటలు. ఈయన మాటల్లో తనకు ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఇష్టం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
కానీ పెద్దరికంగా ఉంటూ పనులు చేయడానికి తనకేం అభ్యంతరం లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు చిరంజీవి. వెనకుండి భజన చేయకపోయినా పర్లేదు కానీ.. అనవసరంగా తన పేరు మధ్యలోకి లాగి చిరంజీవి ఇండస్ట్రీ పెద్దలా ఉండి అలా చేసాడు.. ఇలాగే చేసాడనే చెడ్డ పేరు తనకు అవసరం లేదనుకుంటున్నాడు మెగాస్టార్. ఆయన మాటల్లో అందరికీ అర్థమైంది కూడా ఇదే. అయితే టికెట్స్ విషయంతో పాటు ఇండస్ట్రీలో మరికొన్ని సమస్యల గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలతో చర్చిండానికి చిరు ఎప్పుడూ ముందే ఉంటున్నాడు.
తెలంగాణలో టికెట్ రేట్స్ ఇష్యూ గురించి ప్రభుత్వానికి లేఖ రాసింది ముందుగా చిరంజీవే. ఆయన స్పందించిన తర్వాతే మిగిలిన వాళ్లు అడిగారు. ఆ తర్వాత టికెట్ రేట్స్ కూడా పెంచుతూ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితుల గురించి కూడా ఆయన ముఖ్యమంత్రి జగన్తో చర్చించడానికి సిద్ధమయ్యాడు.
ఇది వ్యక్తిగతమైన భేటీయా లేదంటే సినిమా టికెట్లతో పాటు ఏపీలో ఉన్న సమస్యల నేపథ్యంలో జరగనున్న భేటీయా అనేది క్లారిటీ లేదు. చిరంజీవి, జగన్ కలిసి మధ్యాహ్న భోజనం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. పైగా చిరుకు అప్పాయిట్మెంట్ ఇవ్వడంతో మిగిలిన మీటింగ్స్ కూడా జగన్ క్యాన్సిల్ చేసారని తెలుస్తుంది. పూర్తిగా చిరుతోనే అన్ని విషయాల గురించి జగన్ చర్చింబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. చిరంజీవి, జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో సినిమా ఇండస్ట్రీ దారుణంగా నష్టపోయింది. ముఖ్యంగా హిట్ అయిన అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలకు కూడా ఏపీలో నష్టాలు తప్పలేదు. దాంతో పలువురు బహిరంగ విమర్శలు కూడా చేసారు.
ఈ వాస్తవ పరిస్థితులను చిరంజీవి ముఖ్యమంత్రి జగన్కు వివరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది చిరంజీవి పెద్దరికం కోసం చేయడం లేదని.. ఏదైనా సాయం చేయాల్సి వచ్చినప్పుడు సినీ కార్మికులకు అండగా ఉంటానని మాటిచ్చినందుకే తన బాధ్యత నెరవేరుస్తున్నాడని చిరు వర్గం చెప్తున్న మాట. ఒకవేళ ఈ సమస్యను కానీ చిరు పరిష్కరిస్తే.. అనధికారికంగా చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అయిపోవడం ఖాయం.