కొన్ని సినిమాలు ఒకరి కోసం అనుకుంటే.. అవి మరొకరి చేతుల్లోకి వస్తుంటాయి. అద్భుతమైన విజయం సాధిస్తుంటాయి. అలాగే చిరంజీవి విషయంలోనూ కొన్ని సార్లు జరిగింది. అప్పటికే మూడేళ్లుగా వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న చిరంజీవి కెరీర్‌కు మళ్లీ జీవం పోసిన సినిమా హిట్లర్. ఈ సినిమా ముందు చిరంజీవితో చేయాలి అనుకోలేదు నిర్మాతలు. దానికి మరో హీరో ఉన్నాడు.. ఆయన కాదన్న తర్వాతే చిరు దగ్గరికి వచ్చింది. ఆ కాదన్న హీరో మోహన్ బాబు.
‘హిట్లర్’ సినిమా చిరంజీవి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. రీమేక్ సినిమా అయినా కూడా తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లు ఈ కథను మార్చి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు చిరంజీవి. అయితే ఈ సినిమా వెనక చాలా పెద్ద కథ ఉంది. అదేంటో తెలియాలంటే 26 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. అది 1996.. అప్పుడే మలయాళంలో ఓ సినిమా రూపొందుతుంది. దాని పేరు హిట్లర్.
తీరా విడుదల సమయం రానే వచ్చింది. అక్కడ విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్‌కు ఓ సిడి వచ్చింది. అందులో హిట్లర్ సినిమాను చూడాలంటూ నిర్మాత ఎడిటర్ మోహన్.. ప్రముఖ రైటర్ మరుధూరి రాజాకు చెప్పారు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్, రాజా అతడి భార్య కలిసి ఓ హోటల్లో హిట్లర్ సినిమాను చూసారు. చూసి దాన్ని తెలుగులో చేస్తే బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పారు.
చిరంజీవి హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్న తర్వాతే ఇదంతా జరిగింది. అయితే ముందుగా మోహన్ బాబు హీరోగా ఈ సినిమాను రీమేక్ చేద్దామంటూ ఎడిటర్ మోహన్ ఆలోచించారు. దర్శకుడిగా ఇవివి సత్యనారాయణను అనుకున్నారు. ఇదే విషయం రైటర్ మరుధూరి రాజాకు చెప్తే ఆయన వెళ్లి ఇవివికి ఈ విషయం చెప్పారు . అయితే అప్పటికే వీడెవడండీ బాబూ, అదిరింది అల్లుడు సినిమాలకు మోహన్ బాబుతోనే కమిట్ అయ్యాడు ఇవివి.
దాంతో రాజా కూడా ఆనందించాడు. అప్పటి వరకు చిన్న సినిమాలకే రాస్తున్న తనకు చిరు ఆఫర్ రావడంతో ఉప్పొంగిపోయారు. అయితే దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య వచ్చిన తర్వాత మరుధూరి రాజా కాకుండా ఎల్బీ శ్రీరామ్ రైటర్‌గా వచ్చారు. ఆయన రాకతో రాజా చాలా హర్ట్ అయ్యారు. అవమానంగా ఫీల్ అయిపోయి బయటికి వెళ్లిపోయారు. కానీ ఎడిటర్ మోహన్ కోరిక మేరకు ఓ వర్షన్ కూడా రాసిచ్చారు.
తెలుగులో చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లు కథను మార్చి పెద్ద విజయం అందుకున్నారు ముత్యాల సుబ్బయ్య. ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతా రైటర్ మరుధూరి రాజా ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హిట్లర్ ముందు చిరంజీవి వరస ఫ్లాపుల్లో ఉన్నారు. 1995 డిసెంబర్లో రిక్షావోడు సినిమా తర్వాత 1996లో ఈయన నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. గ్యాప్ ఇచ్చారు కూడా. అలాంటి సమయంలో వచ్చిన ఈ చిత్రం ఆయన సత్తా ఏంటో చూపించింది. 1997 సంక్రాంతి సీజన్లో జనవరి 4 విడుదలైన హిట్లర్.. బాలయ్య పెద్దన్నయ్యతో పోటీ పడి మరీ విజయం సాధించింది.