మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమా కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నాడు. లుక్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే తెలుగులో లూసిఫర్ విడుదలైంది.
కొంతమంది ఈ సినిమాను చూశారు కూడా. అయినా కూడా కథపై నమ్మకంతో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు చిరంజీవి. రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ మోహన్ రాజా దర్శకుడు కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ వైజాగ్ జైలు నుంచి మొదలు పెట్టనున్నారు. అయితే అజిత్ వాలిమై సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా రష్యా వెళ్లడంతో.. చిరంజీవి సినిమా కాస్త ఆలస్యంగా మొదలు కానుంది.
ఈ క్రమంలోనే ఇందులో విలన్గా ఒక స్టార్ హీరోను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న మాధవన్ గాడ్ ఫాదర్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో వివేక్ ఒబెరాయ్ ఈ పాత్రలో నటించాడు. తెలుగులో ఈ క్యారెక్టర్ మాధవన్ నటిస్తే బాగుంటుందని చిరంజీవి సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక్కడే ఓ చిన్న సమస్య వచ్చింది. గతంలో కొన్ని తెలుగు సినిమాలకు నిర్మొహమాటంగా నో చెప్పాడు మాధవన్. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా ఒప్పుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగులో ఇప్పటికే నాగచైతన్య సవ్యసాచి, అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలు చేశాడు మాధవన్. మరి చూడాలి గాడ్ ఫాదర్లో ఈ తమిళ హీరో నటిస్తాడో లేదో.