కొన్ని రోజులుగా బాలీవుడ్లో ఈక్వల్ పే అనే నినాదం ఎక్కువగా వినిపిస్తుంది. అంటే హీరోలతో సమానంగా హీరోయిన్లకు కూడా పారితోషికం ఇవ్వాల్సిందే అని. దీనికి కొందరు హీరోయిన్లు సపోర్ట్ చేస్తున్నారు.. మరికొందరు మాత్రం అది తప్పు అంటూ ఖండిస్తున్నారు. హీరోలతో సమానంగా పే అడగడం సమంజసం కాదు అంటూ కొందరు ముద్దుగుమ్మలు తమ అభిప్రాయాలను కారణాలతో సహా చెప్పేస్తున్నారు.
హీరోలు ఫైట్స్ చేస్తారు.. డాన్సులు చేస్తారు.. ఇమేజ్‌తో సినిమాను నడిపిస్తుంటారు.. వాళ్ళతో సమానంగా తమకు కూడా అంతే పారితోషికం కావాలని కోరడం సమంజసం కాదంటూ కొందరు స్టార్ హీరోయిన్స్ బాహాటంగానే తమ అభిప్రాయం చెప్పారు. అయితే మరికొందరు మాత్రం దీనికి నో చెప్తున్నారు. హీరోలకు అంత ఇస్తున్నపుడు.. ఎందుకు హీరోయిన్లకు ఇవ్వరు అంటూ భీష్మించుకుని కూర్చున్నారు.
కంగనా రనౌత్, కరీనా కపూర్ లాంటి హీరోయిన్లు ఇందులో ముందు వరసలో ఉంటారు. హీరోలకు ఎంత ఇస్తున్నారో.. అంతే తమకు కూడా కావాలంటూ పట్టు పడుతున్నారు వాళ్లు. నిర్మాతలు ఈ విషయంలో తల పట్టుకుంటున్నారు. తాజాగా కరీనా కపూర్ మరోసారి ఈ విషయంపై ఓపెన్ అయింది. బాలీవుడ్లో ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్‌తో పాటు రామాయణం ఆధారంగా రూపొందనున్న మరో సినిమాలో కరీనా కపూర్ నటించబోతుంది.
ఇందులో ప్రధానమైన సీత పాత్రలో ఈమె నటించబోతున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతుంది. ఇందులో నటించడానికి ఏకంగా 12 కోట్ల పారితోషికం అడుగుతుంది కరీనా కపూర్. నిర్మాత ఈ విషయంలో గుండె పగిలాడు.. అంత పారితోషికం ఏంట్రా బాబూ అంటూ ముక్కున వేలేసుకున్నాడు. అయితే దీనిపై ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడుతుంది కరీనా.
ఈక్వల్ పే డిమాండ్‌ను ఆమె ఈ సందర్భంగా తెరపైకి తీసుకొచ్చింది. అంటే హీరో హీరోయిన్ అనే తేడా లేకుండా అందరికీ ఒకేలా పారితోషికం ఇవ్వడం అన్నమాట. స్త్రీ, పురుషులకు ఒకే వేతనం ఇవ్వాలంటూ కోరుతుంది కరీనా. ఇప్పుడు తాను కమిటైన రామాయణం సినిమాను సీత కోణంలో చెప్పాలనేది దర్శక నిర్మాతల ఆలోచన. అంటే సినిమాలో తనదే కదా ముఖ్య పాత్ర.
రాముడు ఉన్నా కూడా ప్రధాన పాత్రను మించిన ప్రధాన పాత్ర తనదే కదా అంటుంది బెబో. అందుకే హీరోయిన్గా తనకు ఆ హక్కు ఉంది.. అందుకే 12 కోట్లు అడిగాను అంటుంది కరీనా కపూర్. ఈక్వల్ పే డిమాండ్ చేయడంలో తప్పేముందని కరీనా ప్రశ్నిస్తుంది. 12 కోట్ల పారితోషికం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని చెప్పుకొచ్చింది కరీనా. బాలీవుడ్లో మరికొందరు హీరోయిన్లు కూడా ఇలాగే ఈక్వల్ పే డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు.