అదేం వింత కోరికరా నాయనా.. ఓ మనిషికి యాక్సిడెంట్ కావాలని కోరుకుంటారా.. అరియానా పైకి ఏదోలా ఉంటుంది కానీ లోపల మాత్రం చాలా కన్నింగ్రా బాబూ అనుకుంటున్నారు కదా..? రాజ్ తరుణ్‌కు యాక్సిడెంట్ కావాలని కోరుకున్నట్లు స్వయంగా ఈ యాంకర్ చెప్పుకొచ్చింది. గతేడాది బిగ్ బాస్ 4 తెలుగులోకి వెళ్లి సూపర్ పాపులర్ అయింది అరియానా. అప్పటి వరకు కేవలం యూ ట్యూబ్ స్టార్‌గానే ఉన్నా.. బిగ్ బాస్ తర్వాత అమ్మాయి గారి జాతకం మారిపోయింది.
ఇప్పుడు సినిమాలు కూడా చేస్తూ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. దానికితోడు సోషల్ మీడియాలోనూ ఈమె క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆ మధ్య వర్మతో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. అమ్మడు జిమ్‌లో ఉండి నానా రచ్చ చేసింది. నడుము చూపిస్తూ.. ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుకుంటూ వర్మ, అరియానా ఎంతో రచ్చ చేసారు. అయితే తాజాగా హీరో రాజ్ తరుణ్‌పై తనకు పీకల వరకు కోపం ఉండేదని చెప్పుకొచ్చింది.
రాజ్ తరుణ్ హీరోగా ఈ మధ్యే విడుదలైన 'అనుభవించు రాజా' సినిమాలో అరియానా కూడా ఉంది. ఈమె స్క్రీన్‌పై కనిపించిన తొలి సినిమా ఇదే. శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా అంతగా ఏం రావడం లేదు. అయినా కూడా ప్రమోషన్స్ ఆపడం లేదు చిత్రయూనిట్. ఈ సినిమా గురించి మాట్లాడుతూనే రాజ్ తరుణ్‌పై తనకున్న కోపాన్ని బయటపెట్టింది అరియానా.
‘నిజం చెబుతున్నాను .. నాకు రాజ్ తరుణ్ అంటే ఒకప్పుడు అస్సలు నచ్చేవాడు కాదు. అతన్ని చూస్తేనే కోపం వచ్చేది.. టీవీలో రాజ్ తరుణ్ సినిమా వస్తుందంటే చాలు తీసేయమని చెప్పేదానిని.. ఒకసారి రాజ్ తరుణ్ కారులో వెళుతుంటే ఆయనకి యాక్సిడెంట్ జరిగి కాలో చెయ్యో విరగాలని కోరుకున్నాను..’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది అరియానా.
ఎందుకు అలాంటి విపరీతమైన కోరికలు కోరింది.. ఇంతకీ రాజ్ తరుణ్ ఏం చేసాడబ్బా అనుకుంటున్నారు కదా..? దాని వెనక కూడా ఓ కథ ఉంది. ఒకసారి ఇంటర్వ్యూ కోసం పిలిచి 3 గంటలకు పైగా వెయిట్ చేయించి ఇవ్వకుండానే వెళ్లిపోయాడు రాజ్ తరుణ్. ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూకు వస్తే.. మధ్యాహ్నం ఒకటిన్నరకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పింది రాజ్ తరుణ్.