బిగ్ బాస్ 5 తెలుగు చివరి దశకు వచ్చేసింది. ఇంట్లో ప్రస్తుతం టాప్ 6 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఎలాంటి గొడవలు లేకుండా.. అరుపులు లేకుండా హాయిగా సాగిపోతుంది ఈ షో. మరో రెండు వారాల్లో ముగిసిపోతుండటంతో ఇప్పటికే టాప్ 5 ఎవరు ఉండొచ్చే క్లారిటీ ప్రేక్షకులకు వచ్చేసింది. ఎవరు ఎలాంటి వాళ్లనే క్లారిటీ కూడా వచ్చేసింది. ఈ క్రమంలోనే మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీరియల్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ కుర్రాడు.. కొన్ని సినిమాలు కూడా చేసాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 5 తెలుగుకు వచ్చిన తర్వాత మనోడికి మంచి ఫాలోయింగ్ వచ్చింది.
మిగిలిన కంటెస్టెంట్స్‌తో పోలిస్తే ముందు నుంచి కూడా మానస్ సైలెంట్ కిల్లర్. ఎక్కువగా మాట్లాడడు.. కానీ అతడి యాక్షన్స్ అన్నీ చెప్తుంటాయి. తక్కువ మాట్లాడు.. ఎక్కువ పని చేయ్ అనే ఫార్ములా అప్లై చేస్తుంటాడు మానస్. ఇంట్లో కూడా అందరికంటే ఎక్కువ పని చేయడంలో మానస్ ఎప్పుడూ ముందుంటాడని హౌజ్ మేట్స్ కూడా ఓపెన్‌గానే ఒప్పుకున్నారు.
అదే సమయంలో స్ట్రాటజీల విషయంలోనూ మానస్ బాగానే ఆలోచిస్తుంటాడు. కచ్చితంగా టాప్ 5లో ఒకడిగా.. ఫైనలిస్టుల్లో నిలుస్తాడని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా బిగ్ బాస్ 5 తెలుగు టాప్ 5లో మానస్ పేరు కూడా కనిపిస్తుంది. అంతేకాదు వెళ్లిపోయే కంటెస్టెంట్స్ కూడా మానస్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అంటున్నారు. పింకీ అయితే నువ్వే విన్నర్ అంటూ పదే పదే చెప్పింది.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మానస్ అంటే కేవలం సైలెంట్‌గానే ఉంటాడని తెలుసు. కానీ టాస్కుల విషయంలో చాలా ముందుంటాడు.. యాక్టివ్ కూడా. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన మీకు నచ్చిన సూపర్ స్టార్ టాస్కులో కుమ్మేసాడు. ఈయన డాన్సులకు అంతా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసాడు మానస్. దానికి ముందు చిరంజీవి పాటకు కూడా డాన్సులేసాడు.
గబ్బర్ సింగ్ పాట వచ్చినపుడు మనోడి ఎనర్జీ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోయింది. ఈ డాన్సుకు కామెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఆ మధ్య సండే టాస్కులో కూడా పవన్ కళ్యాణ్ చిన్నప్పటి ఫోటో వచ్చినపుడు రెండు టీమ్స్ కూడా ఎవరూ గుర్తించలేకపోయారు. వెనక నుంచి సంచాలక్‌గా ఉన్న మానస్.. ఎగిరి గంతేస్తున్నాడు. పవన్ చిన్నప్పటి ఫోటో చూడగానే పూనకాలు వచ్చినోడిలా ఊగిపోయాడు. నాగార్జునను పర్మిషన్ అడిగి మరి పవన్ పేరు చెప్పి డాన్స్ చేసేసాడు.