Swetha Varma Fire: బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ రెండో వారం నామినేషన్ ప్రక్రియ రచ్చ రచ్చ అయ్యింది. ముఖ్యంగా స్వేత వర్మలో ఇంత ఫైర్ ఉందా అని అంతా షాక్ అయ్యారు. ఎవరి బలమేంటో తేల్చుకుందాం రండి అంటూ ఉమా దేవి సవాల్ విసురుతూ నానా బూతులు మాట్లారు. ఉమాదేవీ మాటలు విన్న షణ్ముఖ్ బిత్తరపోగా.. యానీ మాస్టర్ ఏడ్చేసింది. మిగిలిన హౌస్ మేట్స్ అంతా ఉమా దేవి మాట్లాడిన మాటలకు షాక్ లోనే ఉండిపోయారు.
నక్క వర్సెస్ గద్ద టీమ్
సోమవారం నామినేషన్ ప్రక్రియతో హౌస్ మేట్స్ మధ్య గొడవ పెట్టాడు బిగ్ బాస్. అందులో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీములుగా విడిదీసి టాస్క్ ఇచ్చారు. నక్క టీములో ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్, సన్నీ, కాజల్, శ్వేత, నటరాజ్ ఉండగా, గద్ద టీములో లోబో, యానీ మాస్టర్, శ్రీరామ్, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్, ప్రియాంక ఉన్నారు. హౌస్మేట్స్ ఇంటి నుంచి బయటకు పంపేందుకు నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్‌పై పెయింట్ పూయాల్సి ఉంటుందన్నాడు. ఇంటిసభ్యులు వాళ్ల టీమ్ కాకుండా ఇతర టీమ్‌లో నుంచి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని మెలిక పెట్టాడు. సిరి కెప్టెన్ కావడంతో ఆమెను నామినేషన్ నుంచి తప్పించుకుంది.
మొదటగా సిరి.. ఉమాదేవిని, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. నటరాజ్ మాస్టర్.. ప్రియ మంచి కోసం చెప్పినా తను నన్ను పక్కకు పిలిచి తిట్టేదని, అక్కడ హర్టయ్యాను అంటూ ఆమెను నామినేట్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన ప్రియ.. మీరు ముందు ఇన్ఫ్లూయెన్స్ చేయడం ఆపేయండని కౌంటరిచ్చింది. తర్వాత ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేశాడు. యానీ మాస్టర్.. ఉమాదేవి, కాజల్‌ను; సన్నీ.. టాస్కుల్లో ఇంకా యాక్టివ్ కావాలని ప్రియను, కిచెన్‌లో ఉండకుండా ఆటలోకి రమ్మంటూ ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేశాడు.
మానస్.. తాను కెప్టెన్సీ కాకుండా అడ్డుకున్నందుకు లోబోను నామినేట్ చేశాడు. దీన్ని సహించలేకపోయిన లోబో.. LOBO నాటే నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్, పెద్ద పెద్ద హీరోలు నన్ను గుర్తుపడతరు అని కాసేపు తనకు తాను డప్పు కొట్టుకున్నాడు. సపోర్ట్ చేయాలని పోతే తనకే నామం పెడుతున్నారని అసహనానికి లోనయ్యాడు. ఇదే మాట గతంలో ప్రస్తావించినప్పుడు ఎందుకు చెప్పలేదని మానస్ అడగ్గా.. 'మీరు హీరో కదా! విననీకి రెడీ లేరు, నా ముందు యాటిట్యూడ్ చూపిస్తున్నవ్, కానీ నా ముందు చిన్నపిల్లోడివి' అని ఆవేశపడ్డాడు. తర్వాత మానస్.. ప్రియకు రంగు పూసి నామినేట్ చేశాడు.
తరువాత విశ్వ.. కంటెస్టెంట్లు కూర లేదన్నప్పుడు నాగార్జున ఇచ్చిన ఆలూ కూర వారికి పెట్టకపోవడం సరికాదంటూ ఉమాదేవిని నామినేట్ చేశాడు. నాగ్.. ఆ కూరను ఎవరికీ షేర్ చేయొద్దన్నాడని, ఆ మాటకు తాను కట్టుబడి ఉన్నానని ఉమ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆమె బూతులు కూడా మాట్లాడటంతో ప్రియాంక సింగ్ పడీపడీ నవ్వింది. అనంతరం విశ్వ కాజల్‌ను నామినేట్ చేశాడు. లహరి.. హమీదా, యానీ మాస్టర్‌ను; హమీదా.. లహరి, సెట్ శ్వేత కనబడట్లేదని శ్వేతను నామినేట్ చేశారు. ఇక ఉమాదేవి తనవంతు రాగానే ఓ రేంజ్లో అందరికీ సవాలు విసిరింది. దమ్ముధైర్యం, బుద్ధిబలం ఉన్నవాళ్లు నాతో ఆడటానికి ట్రై చేయండి అని చాలెంజ్ చేసింది. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అంటూ యానీ మాస్టర్, విశ్వలను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఉమాదేవి, ప్రియాంకసింగ్, యానీ మాస్టర్ల మధ్య పెద్ద ఫైటే నడిచింది. నాకు రెస్పెక్ట్ అవసరం లేదు అని ఉమా తేల్చి చెప్పడంతో పింకీ.. పోవే ఉమా పో.. అని వ్యంగ్యంగా మాట్లాడింది.
ఇక తరువాత వచ్చిన శ్వేత ఒక్కొక్కరికీ బొమ్మ చూపించింది. అసలు రంగులు బయటపడుతున్నాయంటూ లోబో కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ను పడేసింది. తన లైఫ్‌లో తనను ఎవరూ సపోర్ట్ చేయలేదన్నారు.. ఒక్కదాన్నే ఇక్కడి దాకా వచ్చానని ఆవేశపడింది. కాజల్, ప్రియ లేనప్పుడు వాళ్ల గురించి మాట్లాడావు, ఇప్పుడు మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ లోబోకు ఇచ్చిపడేసింది. సెట్ శ్వేత లేదని ఎలా అన్నావు? అంటూ హమీదా మీద చిందులు తొక్కింది. మీరిద్దరూ ఫేక్ అని తిట్టిపోసింది.
ఆడవాళ్లకు ఆడవాళ్లైనా గౌరవం ఇవ్వాలని ఉమాదేవి మీద మండిపడటంతో ఇంటిసభ్యులు అందరూ చప్పట్లు కొట్టారు. మిమ్మల్ని సపోర్ట్ చేసిన యానీ మాస్టర్‌ను అన్ని మాటలు ఎలా అనగలిగావు? అని నిలదీయడంతో మాస్టర్ కన్నీటిపర్యంతమైంది. అయితే ఉమా మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం. ఇక హమీదాను ఫేక్ అంటూ గట్టిగా ఆమె ముఖం మీద కొట్టినట్లుగా రంగు పూసింది. కళ్లలో పడుతుందని వారిస్తున్నా తనకు అనవసరం అంటూ దురుసుగా ప్రవర్తించింది. అయితే శ్వేత తను నన్ను కొట్టిందంటూ ఏడ్చేసింది హమీదా.
ఈ వారం నామినేషన్ లోకి ఏడుగురు వచ్చారు.
కాజల్.. యానీ మాస్టర్, విశ్వను; జెస్సీ.. విశ్వ, లోబోను; శ్రీరామచంద్ర.. నటరాజ్ మాస్టర్, వంట రాదని అబద్ధం చెప్పావంటూ కాజల్‌ను నామినేట్ చేశారు. దీంతో మరోసారి ఏడ్చేసింది కాజల్. ప్రియ.. సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ సన్నీని, ఆ తర్వాత నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. రవి.. ప్రియాంక సింగ్, శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి నక్క టీమ్‌లో నుంచి ఉమా, నటరాజ్, కాజల్, గద్ద టీమ్‌లో నుంచి లోబో, ప్రియాంక, యానీ, ప్రియ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు.