Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో కొట్లాటలు జరుగుతున్నాయి. తొలివారం నుంచే నోటికి పని చెప్పిన కంటెస్టెంట్లు రెండోవారానికి వచ్చేసరికి చేతికి పని చెప్తున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు.. ఒకరిపై ఒకరు ఫిజికల్ గా దాడి చేసుకుంటున్నారు. తోసుకుంటున్నారు. ఎత్తిపడేస్తూ, కొడుతూ నానా అరాచకం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్ల దూకుడు మరో లెవెల్లో ఉంటోంది. కొట్టుకుందాం రా అంటూ కోట్లాది మంది ప్రేక్షకుల ముందే సవాలు విసురుతూ కుస్తీలు పడుతున్నారు. నాగార్జున 5 రెట్ల ఎంటర్టైన్మెంట్ అంటే ఏమో అనుకున్నాం గానీ మరీ ఇంత ఫ్రస్టేషన్ ఉంటుందనుకోలేదంటున్నారు ప్రేక్షకులు.
కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఏమో కానీ బిగ్‌బాస్ కుస్తీల ప్రోగ్రామ్‌లా మారిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే వారి ఆటతో ప్రేక్షకులకు చెమట్లు పట్టించారు. అప్పటిదాకా స్నేహగీతం పాడుకున్నవాళ్లు కూడా బద్ధ శత్రువుల్లా మారిపోయారు. సైలెంట్‌గా కనిపించే శ్రీరామ్ శివాలెత్తిపోగా శ్వేత అందర్నీ ఓ ఆటాడించింది. కంటిచూపుతో గడగడలాడించే ఉమాదేవిపై దాడి చేయడంతో ఆమె కాళికా అవతారమెత్తింది. దీంతో మరోసారి యానీ మాస్టర్, ఉమాల మధ్య అగ్గి రాజుకుంది.
అరుపులు, కొట్లాటలు, బూతులతో బిగ్‌బాస్ హౌస్ అట్టుడికిపోతోంది. మామూలుగానే మాటలతో విరుచుకుపడే కంటెస్టెంట్లు టాస్క్‌ల్లో తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. అయితే మరీ ఈ రేంజ్లో కొట్టుకోవడాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. కుళాయి దగ్గర నీళ్ల కోసం మహిళలు పెట్టుకునే కొట్లాటల కంటే దారుణంగా ఉన్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరి అరాచకాన్ని చూడలేకపోతున్నాం, వాళ్లకు అప్పుడప్పుడూ కాస్త పువ్వులను చూపించండ్రా, మరీ వయొలెంట్‌గా ఉన్నారు అని సలహా ఇస్తున్నారు నెటిజన్లు.
శ్రీరామ్-మానస్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. మానస్‌ను పిలిచి వయసెంత అని అడిగాడు శ్రీరామ్. అతడు 28 అని చెప్పాడు. అందుకే నీ ఏజ్ అడిగా, ఇప్పటికీ చిన్నపిల్లోడివే, నీకు మెచ్చురిటీ లేదని సింగర్ వ్యాఖ్యానించగా.. మీకు ఏజ్ పెరిగినా మెచ్యురెటీ లేదని రివర్స్ కౌంటరిచ్చాడు మానస్. మరోవైపు లోబో తన ఇంటిని గుర్తు చేసుకుని ఏడ్చేశాడు. తనకేమైనా ఐతే తన వాళ్లను చూసుకునే వాళ్లెవరూ లేరని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ తర్వాత ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా? టాస్క్ మొదలైంది. ఇందులో లోబో లేకుండానే గద్ద టీమ్ ఆడి గెలిచింది. దీంతో వారికి ఒక ఫ్లాగ్ వచ్చింది.
'పంతం నీదా నాదా' టాస్క్ తిరిగి ప్రారంభమైంది. ఇందులో అనుకోకుండా సన్నీ పింకీ చేయిని విసిరేయడంతో ఆమె కిందపడిపోయింది. అది చూసిన శ్రీరామ్.. పగిలిపోద్ది అని సన్నీని తిట్టాడు. తన మీద నోరు జారినందుకు సన్నీ ఆవేశపడుతుండగా.. మగాడివైతే ఆడుదువు రా అంటూ అతడిని మరింత రెచ్చగొట్టింది ప్రియ. పర్పుల్ టీమ్ మీద పడి పిల్లోస్ తీసుకోవాలని చూసిన ఉమాదేవిని ప్రియ ఓ వస్తువుతో కొట్టింది. తనను మాటంటేనే పడని ఉమా దెబ్బకు దెబ్బ తీయకుండా ఉంటుందా! తన మీద చేయి చేసుకున్న ఆ టీమ్ సభ్యులను ఉతికారేయాలని చూసింది. తనను కొడితే డ్రెస్సు చింపుతానని ఉమా అనడంతో యానీ మాస్టర్ రెచ్చిపోయింది. ఒసేయ్ ఉమా, సిగ్గు లేదా, థూ అని చీదరించుకుంది. మరోపక్క పర్పుల్ టీమ్ దగ్గరకు వచ్చిన శ్వేతను తన్నేందుకు ప్రయత్నించింది ప్రియ. రక్తాలు వచ్చేలా కొట్టుకు చస్తున్నా పట్టించుకోని బిగ్‌బాస్ అంతా అయిపోయాక మాత్రం హౌస్‌లో హింసకు తావు లేదంటూ హెచ్చరిక చేయడం గమనార్హం.
ఓ వైపు గేమ్ హాట్ హాట్ గా సాగుతుంటే.. మరోవైపు హౌస్‌లో లవ్ ట్రాక్ కూడా మొదలైంది. శ్రీరామచంద్ర, హమీదా స్విమ్మింగ్ పూల్ దగ్గర కబుర్లాడుతూ కనిపించారు. అంతేకాదు, హమీదాకు మసాజ్ చేస్తున్నాడు శ్రీరామ్. ఇదే మంచి సమయం అనుకున్న హమీదా.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, అంతలోనే మళ్లీ దూరంగా ఉండాలనుకుంటాను అని మనసులో మాట బయట పెట్టింది. దీనికి ఏదోలా ఉందీ వేళ నాలో.. ఈ వింత ఏమిటో.. గిలిగింత ఏమిటో అని బ్యాక్‌గ్రౌండ్‌లో లవ్ సాంగ్ ప్లే చేశాడు బిగ్‌బాస్.
టాస్కు గెలిచేందుకు రెండు టీంల సభ్యులు యుద్ధమే చేస్తున్నారు కంటెస్టెంట్లు. స్నేహితులుగా ఉన్నవాళ్లు కూడా గేమ్‌లో బద్ధ శత్రువులుగా మారిపోయారు. మొత్తానికి బిగ్‌బాస్ ఇచ్చిన ఈ టాస్కులో గద్ద టీమ్ గెలిచినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ టీములో నుంచి విశ్వ కెప్టెన్‌గా ఎంపికైనట్లు ఓ వార్త లీకైంది. మొదటి వారంలో రేషన్ మేనేజర్‌గా కొనసాగిన విశ్వ రెండో వారంలో కెప్టెన్ అయ్యాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!