తెలుగు బుల్లితెరపైనే కాదు.. బహుశా ఇండియన్ టెలివిజన్‌లోనే మునుపెన్నడూ లేని టిఆర్పీలను పరిచయం చేసిన సీరియల్‘కార్తీక దీపం’. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకు ఈ సీరియల్ అనేది ఓ అడిక్షన్. వంటలక్క అనేది పేరు కాదు.. ఒక వ్యసనం. వదులుకోలేని వ్యసనంగా మారిపోయింది కార్తీక దీపం సీరియల్. అయితే మనుపటి మ్యాజిక్ ఇప్పుడు చేయడంలో వెనకబడిపోతుంది కార్తీక దీపం.
ఒకప్పుడు సాయంత్రం 7.30 అయిందంటే చాలు ఎవరైనా కూడా స్టార్ మా ఛానెల్ పెట్టుకోవాల్సిందే. అలా కాదని మరో ఛానెల్ పెడితే ఇంట్లో గొడవలు కాదు.. ఏకంగా మర్డర్లు జరిగిపోతాయి. ఎందుకంటే అక్కడున్నది వంటలక్క. ఆమె ధాటికి ఐపిఎల్ కూడా తట్టుకోలేక చేతులెత్తేసింది. అంతగా ప్రభంజనం సృష్టించిన కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు అనుకున్న స్థాయిలో రేటింగ్ తీసుకురావడంలో విఫలమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంటి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ 7 గంటలకే పూర్తి చేసుకుని టీవీ ముందుకు వచ్చే వంటలక్క వీర ఫ్యాన్స్ కూడా ఇప్పుడు కార్తీక దీపం సీరియల్‌ను లైట్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు వంటలక్క ఏం చేస్తుందా అని ఆమె కోసం చూసే ఆడియన్స్ ఇప్పుడు ఏం చేసినా కథ మాత్రం అక్కడే ఉంటుందిలే అని పట్టించుకోవడం మానేసారు. హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు అయితే సాయంత్రం వరకు ఓపిక పట్టలేక ఉదయాన్నే చూసేవాళ్లు ఈ సీరియల్‌ను.
అంత క్రేజ్ ఉన్న సీరియల్ మరోటి లేదంటే అతిశయోక్తి కూడా కాదేమో..? ఇప్పటికే 1200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది కార్తీక దీపం సీరియల్. వంటలక్క క్రేజ్ ముందు టిఆర్పీ జుజుబీలా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ సీరియల్‌పై వచ్చినన్ని మీమ్స్ మరే సీరియల్‌పై రావు కూడా. అయితే ఇవన్నీ ఒకప్పుడు మాత్రమే.. కొన్ని వారాలుగా కార్తీక దీపం హవా పూర్తిగా తగ్గిపోయింది. అదే ఛానెల్లో వచ్చే గృహలక్ష్మి లాంటి సీరియల్స్ పుంజుకున్నాయి.
2017లో మొదలైన కార్తీక దీపం.. అనేక మలుపులు తిరుగుతూ 2022లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మధ్య సీరియల్ అయిపోతుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అలాంటిదేం లేదని.. మరో ఏడాదిన్నర వరకు కూడా ఈ సీరియల్‌కు ఢోకా లేదని తెలుస్తుంది. ఎందుకంటే కథ లాగుతున్న.. సాగుతున్న తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇప్పటికీ అదే స్లో నెరేషన్ సాగుతుంది..
ఇప్పటికే తెలుగులో మోనిత చేసిన మోసాన్ని తెలుసుకున్న డాక్టర్ బాబు.. వంటలక్క దగ్గరికి వచ్చేసాడు. ఆమె గురించి చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. అయితే తర్వాత మళ్లీ కొన్ని ట్విస్టులు వస్తాయని తెలుస్తుంది. డాక్టర్ బాబు, వంటలక్క కలిసే సమయానికే వంటలక్క ప్రాణాలు కోల్పోతుందని తెలుస్తుంది. అది చూసి గుండె పగిలేలా ఏడుస్తాడు డాక్టర్ బాబు.
మరో 300 ఎపిసోడ్స్ వరకు ఇందులో బాకీ ఉన్నాయి. అయితే వంటలక్క ప్రాణాలు కోల్పోతే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో గృహిణిల కన్నీరుతో వరదలు వచ్చేస్తాయేమో..? ఓ సారి దర్శక నిర్మాతలు ఈ విషయంపై కూడా ఆలోచించాల్సిందే. ఎందుకంటే మలయాళంలో మీరు ఎలా ముగించినా పెద్దగా పట్టించుకోరు కానీ తెలుగులో మాత్రం స్యాడ్ ఎండింగ్ ఇస్తే కన్నీటి వర్షం పారుతుంది. పడిపోతున్న రేటింగ్స్ పైకి లేపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.