కరోనా వైరస్ వచ్చిన తర్వాత సినిమా వాళ్లు ప్లానింగ్ వేసుకోవడమే మానేసారు. ఎందుకంటే వాళ్లు ఒకటి అనుకుంటే.. చివరికి ఇంకొకటి జరుగుతుంది. అందుకే రిలీజ్ డేట్స్ విషయంలో కూడా వాళ్లు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇదిగో ఈ తేదీకి వస్తామని చెప్పినా కూడా చివరి నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అలా కన్ఫర్మ్ అయిన రిలీజ్ డేట్స్ మార్చుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి.
ముఖ్యంగా ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలకే ఇది తప్పలేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా సైతం దీనికి మినహాయింపు కాదు. ఈయన నటిస్తున్న సినిమాల విడుదల తేదీలు చాలా వరకు వాయిదా పడుతున్నాయి. ముఖ్యంగా అందులో భీమ్లా నాయక్ అన్నింటి కంటే ముందుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే పట్టుదలతో పగలు రాత్రి షూటింగ్ చేసాడు పవన్.
జనవరి 12న విడుదల కానుందని దర్శక నిర్మాతలు కూడా చెప్పారు. అయితే మిగిలిన సినిమాల కోసం దాన్ని పోస్ట్ పోన్ చేయించారు. కానీ కరోనా రావడంతో ఆ మిగిలిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. దాంతో పవన్ ఫిబ్రవరి 25న శివరాత్రి కానుకగా రావాలని చూస్తున్నాడు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ అప్పుడు రావడం కూడా కష్టమే అని తెలుస్తుంది. ఇంకా భీమ్లా నాయక్‌లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అలాగే ఉంది.
మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. కరోనా కారణంగా వీటికి కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడింది. అందుకే ఫిబ్రవరి 25న సినిమా విడుదల కావడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. పైగా అప్పటి వరకు కరోనా పోతుందనే గ్యారెంటీ కూడా లేదు. మరో రెండు మూడు నెలలు వైరస్ విజృంభన ఇలాగే ఉంటుందని వైద్య శాఖ కూడా ఇప్పటికే తెలిపింది.
ఇప్పుడు కానీ పవన్ సీన్లోకి వస్తే.. చిరంజీవితో బాక్సాఫీస్ వార్ తప్పదు. అయితే ఆచార్య మరోసారి పోస్ట్ పోన్ కావాల్సిందే.. లేదంటే భీమ్లా నాయక్ మరో తేదీ చూసుకోవాలి. అంతేకానీ ఒకేరోజు అన్నాతమ్ముడు అయితే బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం దాదాపు అసాధ్యం. అలా చేస్తే ఇద్దరూ నష్టపోతారు. మరి చూడాలిక.. చివరి వరకు ఏం జరగబోతుందో..?