50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ బహుశా ఒకప్పుడు కనిపించేవి కానీ గత పదేళ్లుగా కనిపించడం లేదు. ఒకప్పుడు తమ హీరో సినిమా ఇన్ని సెంటర్స్‌లో 100 రోజులు ఆడిందంటూ గర్వంగా చెప్పుకునేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మా హీరో సినిమా ఫస్ట్ వీక్‌లో ఇన్ని వందల కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో మూడు వారాలు ఆడిందంటే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.
50 రోజుల మాట వినబడక చాలా రోజులు అయిపోయింది. 2020 పండగ సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో అతి కష్టమ్మీద 50 రోజులు ఆడాయి. ఆ తర్వాత కరోనా రావడంతో ఆ మాటే గగనం అయిపోయింది. అలాంటిదిప్పుడు అఖండ సినిమా 50 రోజుల పండగ జరుపుకోబోతుంది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్‌కు పొర్లు దండాలు పెడుతున్నారు. 50 రోజులు అనే మాట మరిచిపోయి చాలా రోజులైపోయింది. కానీ అఖండ సినిమాతో అది గుర్తు చేస్తున్నాడు బాలయ్య.
ఇప్పుడున్న సమయంలో 20 రోజులు థియేటర్స్‌లో కనిపించడమే గొప్ప విషయం అనుకుంటే.. అఖండ సినిమా ఏకంగా 50 రోజులు ఆడుతుంది. 46వ రోజు కూడా ఏపీ, తెలంగాణలో ఈ సినిమా 20 లక్షల షేర్ వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో థియేటర్‌కి ఏ సినిమా వచ్చినా పట్టుమని పది రోజులు ఆడితే అదే గొప్ప విషయమని అనుకునే పరిస్థితి నుంచి 50 రోజులు థియేటర్స్‌లో ఉండటం అనేది చిన్న విషయం కాదు. అందులోనూ దాదాపు 24 సెంటర్స్‌లో నేరుగా 50 రోజులు ఆడుతుంది అఖండ.
ఇప్పటికే ఏడు వరాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మరో మూడు రోజుల్లో 50 రోజులను పూర్తి చేసుకోబోతోంది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే మంచి టాక్ వచ్చింది. అయితే 50 రోజులు ఆడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన మూడో సినిమా ఇది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.
బాలయ్య కెరీర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ‘పుష్ప’, ‘శ్యామ్ సింగరాయ్’ ఇలా ఏ సినిమాలు వచ్చినా కూడా అఖండ జోరు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు బంగార్రాజు వచ్చినా కూడా సంక్రాంతికి సైతం సత్తా చూపిస్తున్నాడు బాలయ్య. చాలా ఏరియాలలో విడుదలైన 46వ రోజు కూడా హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి. జనవరి 21న ఈ సినిమా ఓటిటిలో విడుదల కానుంది. హాట్ స్టార్ డిస్నీ దీన్ని భారీ రేటుకు సొంతం చేసుకుంది.
ఈ మధ్య కాలంలో ఇలాంటి జోరు చూపించిన సినిమా మరోటి లేదు. కేవలం తెలుగులోనే కాదు.. మొత్తం ఇండియాలోనే ఈ రికార్డు సాధించిన ఏకైక హీరో బాలయ్య. హైదరాబాద్, గాజువాక, అనకాపల్లి, వైజాగ్, కర్నూల్, పొద్దుటూరు, హిందూపురం, తాటిపాక, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, కోయిలకుంట్ల సహా.. 24 సెంటర్స్‌లో అఖండ 50 రోజులు పూర్తి చేసుకుంది. అన్నట్లు ఈ చిత్రం 54 కోట్ల బిజినెస్ చేస్తే.. ఇప్పటి వరకు 73 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే దాదాపు 18 కోట్లు లాభాలన్నమాట.