అన్‌స్టాపబుల్ షో మొదలైన తర్వాత బాలయ్యలోని మరో కోణం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఈ ఒక్క షోతో ఆహా సబ్క్రిక్షన్స్ కూడా చాలా వరకు పెరిగాయని తెలుస్తుంది. బాలయ్య ఎంట్రీ ఇచ్చిన రికార్డు వ్యూస్ వస్తున్నాయి. ఓటిటిలోనే కాదు ఇప్పటి వరకు బుల్లితెరపై కూడా ఎప్పుడూ హోస్ట్ అవతారం ఎత్తని బాలయ్య.. ఇప్పుడు అది చేస్తున్నాడు. దాంతో ఫ్యాన్స్ కూడా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతున్నారు.
దాని ఫలితమే మొన్న విడుదలైన మోహన్ బాబు మొదటి ఎపిసోడ్‌కు రికార్డ్ వ్యూవర్ షిప్. ఆహా మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఏ షోకు లేనంత పాపులారిటీ ఇప్పుడు బాలయ్య అన్‌స్టాపబుల్ దక్కించుకుంటుంది. తాజాగా రెండో ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ షో కోసం చిన్న పిల్లాడైపోతున్నాడు బాలయ్య. తాజాగా విడుదలైన నాని ప్రోమో చూస్తుంటే ఈ విషయం అర్థమైపోతుంది.
నాతో పులిహోర కబుర్లు చెప్పొద్దు అంటూ నానిని ఆట పట్టించే ప్రయత్నం చేసాడు నటసింహం. నాని వచ్చినప్పటి నుంచి కూడా చాలా జోష్‌గా కనిపించాడు బాలయ్య. ఆయనతో కలిసిపోయి అద్భుతంగా మాట్లాడాడు. అంతేకాదు తనకు కావాల్సిన సమాధానాలు రప్పించుకునే ప్రయత్నం కూడా చేసాడు. ‘ఈ రోజు మన గెస్ట్ మీ నుంచి వచ్చాడు.. సెల్ఫ్మేడ్కి సర్నేమ్’ అంటూ నానికి అదిరిపోయే ఇంట్రడక్షన్ ఇచ్చాడు బాలయ్య.
ఆ తర్వాత కాసేపు బాలకృష్ణ-నాని కాసేపు ముచ్చటించుకోవడమే కాకుండా సరదాగా క్రికెట్ కూడా ఆడారు. ఈ క్రమంలోనే బాలయ్య చేతికి బ్యాట్ రాగానే ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేసారు. దాంతో ‘మీరు ఆగండ్రా.. టెన్షన్ పెట్టకండి’ అని బాలకృష్ణ తనదైన శైలిలో నవ్వులు పూయించారు. ఆ వెంటనే నాని కూడా ‘ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు’ అంటూ డైలాగ్ చెప్పాడు.
మరోవైపు బాలయ్య కూడా నాని ఈగ సినిమాలోని ‘అందరికీ పెట్టి నాకు పెట్టలేదంటే’ అంటూ డైలాగ్ చెప్పాడు. మధ్యలో తన మందు బ్రాండ్ కూడా ప్రమోషన్ చేసుకున్నాడు బాలయ్య. ఇక ‘ఒత్తిడి తగ్గించుకునేందుకు నువ్వు ఏం చేస్తావ్..? ఎలా రిలాక్స్ అవుతావ్..?’ అని బాలకృష్ణ అడగ్గా ‘సినిమాలు చూస్తా’ అంటూ నాని సమాధానమిచ్చాడు. దాంతో వెంటనే ‘పులిహోర కబుర్లు చెప్పొద్దు’ అంటూ బాలకృష్ణ సెటైర్ వేసాడు.
మళ్లీ ఆ తర్వాత సీరియస్ డిస్కషన్‌లోకి వెళ్లిపోయారు నాని, బాలయ్య. తన సినిమా విడుదల విషయంలో ఎదుర్కొన్న సమస్యల్ని నాని చెప్పుకొచ్చాడు. ఎలాంటి సమయంలో ఓటిటిలో విడుదల చేసాం అనేది వివరించాడు. నాని నటించిన వి.. టక్ జగదీష్ సినిమాలు ఓటిటిలోనే విడుదలయ్యాయి. దాంతో ఈయన హీరోనే కాదంటూ డిస్ట్రిబ్యూటర్లు ఫైర్ అయ్యారు. ఇకపై నాని సినిమాలు విడుదల చేయమంటూ వాళ్లు ప్రెస్ మీట్ పెట్టారు.
తన సినిమాలు ఎందుకు అలా విడుదల చేయాల్సి వచ్చిందో చెప్పినా కూడా వాళ్లు అప్పుడు అర్థం చేసుకోలేదని చెప్పాడు నాని. ఆ సమయంలో తనను కొందరు డిస్ట్రిబ్యూటర్లు తప్పుగా అర్థం చేసుకోవడాన్ని కూడా చెప్పుకొచ్చాడు నాని. అలా సరదాగా మొదలై.. సీరియస్‌గా ఈ ప్రోమో ఎండ్ అయింది. నవంబర్ 12న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఇందులో ఇంకా ఎన్నెన్ని నిజాలను నాని నుంచి బాలయ్య బయటికి రప్పించాడో చూడాలిక.