ఒమిక్రాన్ కొత్త రూల్స్" width="1600" height="1600" class="size-full wp-image-1143340" /> మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటారు కదా.. ఇప్పుడు పండు కాదు ఏకంగా చెట్టే పడిపోయింది. అసలే ఏపీలో సినిమాలు విడుదల చేయడానికి నరకం చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అక్కడ పాజటివ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా కలెక్షన్స్ రావడం లేదు. టికెట్ రేట్ల ఇష్యూతో తల పట్టుకుని కూర్చున్నారు నిర్మాతలు. వాళ్లకు ఇప్పుడు తాజాగా కరోనా మహమ్మారి కూడా రెడీ అయిపోయింది. ఇన్ని రోజులు నివురు గప్పిన నిప్పులా ఉన్న వైరస్.. మొన్న జనవరి 1 నుంచి విరుచుకుపడుతుంది.
ఒక్కసారిగా వేల నుంచి లక్షల్లోకి కేసులు వచ్చేసాయి. దాంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయిపోయాయి. మునపటి పరిస్థితులు మళ్లీ వచ్చేలా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ కూడా వేసేలా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సంక్రాంతి రేసు నుంచి చాలా సినిమాలు తప్పుకున్నాయి. వైరస్ సమయంలో తమ సినిమాలను విడుదల చేయడం మంచిది కాదని వాళ్లు పక్కకు జరిగారు. అయితే పండక్కి రాబోయే సినిమాలకు కూడా చుక్కలు తప్పేలా లేవు.
ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్ వరకు వస్తారా లేదా అనేది అనుమానంగానే మారింది. సంక్రాంతికి వస్తున్న ఒకే ఒక్క పెద్ద సినిమా బంగార్రాజు. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించాడు. జనవరి 14న విడుదల కానుంది ఈ సినిమా. ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ మొదలవ్వబోతుంది. ఈ మేరకు కరోనా ఆంక్షలను విధించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ నిర్వహించబోతుంది. సినిమా థియేటర్లు కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడపనున్నట్లు తెలుస్తుంది. ఇదే కానీ జరిగితే.. ఇప్పటికే టికెట్ రేట్ల ఇష్యు కారణంగా దారుణంగా నష్టపోయిన నిర్మాతలకు ఇప్పుడు పిడుగు లాంటి వార్తే. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకి ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరోటి ఉండదు.
50 శాతం ఆక్యుపెన్సీ.. అందులోనూ తక్కువ టికెట్ రేట్లు.. ఈ లెక్కన 10 కోట్లు వచ్చే సినిమాకు కనీసం 4 కోట్లు కూడా రావు. నిజానికి ఈ సంక్రాంతి ట్రిపుల్ ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ లాంటి పెద్ద సినిమాలతో కళకళలాడాల్సి ఉంది. కానీ కరోనా కేసులు రోజు రోజుకీ భారీగా పెరుగుతుండడంతో ఈ సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు ఉన్న చిన్న సినిమాలకు కూడా కరోనా చుక్కలు చూపిస్తుంది.