తెలుగు ఇండస్ట్రీలో భక్తి చిత్రాలతో రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు జేకే భారవి. ఈయన పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలే. వాటితోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. రచయితగానూ భారవికి మంచి ఇమేజ్ ఉంది. పైగా స్టార్ హీరోలతో పని చేసిన అనుభవం కూడా ఈయన సొంతం. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.
అప్పుడప్పుడూ ఒడిదుడుకులు కూడా తప్పవు. ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఒక్కోసారి జారి కింద పడిపోతుంటారు. భారవి విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకప్పుడు కార్లలో తిరిగిన ఈయన.. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఓలా బైక్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణాలు కూడా చెప్పుకొచ్చాడు ఈయన. ఈ మధ్యే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు జేకే భారవి.
తెలుగులో అన్నమయ్య, రామదాసు, ఓం నమో వెంకటేశాయ, శ్రీ మంజునాథ లాంటి ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఆయన సొంతం. తెలుగు, కన్నడ భాషల్లోనూ బ్లాక్బస్టర్ సినిమాలకు కథలు అందించడంతో పాటు నిర్మాణ సహకారం కూడా అందించాడు భారవి. అలాంటి ఆయన ఒకేఒక్క సినిమాతో కుదేలయిపోయాడు. ఆ సినిమా ఇచ్చిన షాక్ నుంచి కోలుకోలేక ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాడు.
9 ఏళ్ళ కింద వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ భారవిని ఇబ్బందులు పెడుతూనే ఉంది. మళ్లీ అందులో స్టార్స్ నటించడం ఇక్కడ కొసమెరుపు. అంతగా ఈయన్ని ఆర్థికంగా చితికిపోయేలా చేసిన సినిమా జగద్గురు ఆదిశంకర. కెరీర్లో ఎన్నో ఎత్తులు చూసిన తాను.. ఇప్పుడు పల్లంలో పడిపోయానని చెప్పుకొచ్చాడు ఈయన. ఒకప్పుడు కార్లలోనే తిరిగిన తనకు ఇప్పుడు ఓలా బైక్ గతి అయిపోయింది అంటున్నాడు ఈయన.
ఎన్నోఏళ్లుగా సంపాదించిందంతా జగద్గురు ఆదిశంకర సినిమాతో పోయిందని చెప్పాడు ఈయన. ఈ సినిమాలో నాగార్జున, శ్రీహరి సహా చాలా మంది స్టార్స్ నటించారు. అప్పట్లో భారీ ప్రమోషన్స్ చేసి మరీ ఈ సినిమాను విడుదల చేసారు. కానీ ఫలితం మాత్రం దారుణంగా వచ్చింది. చిరంజీవి శ్రీ మంజునాథ సన్నివేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత భారవి మళ్లీ ఎక్కువగా కనిపించలేదు.
ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో తన కథలు ఓకే అయ్యాయని.. కానీ కరోనా వల్ల డబ్బులు రావడం ఆలస్యమవుతోందని చెప్పాడు భారవి. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే నాగార్జున, రాఘవేంద్రరావు లాంటి వాళ్లు తనకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు.. కానీ అలా చేయి చాచి అడగడం తనకు ఇష్టముండదు అని చెప్పుకొచ్చాడు ఈయన. ఏదేమైనా కూడా కష్టం వచ్చినపుడు సుఖం కూడా ఉంటుంది. తన సమయం కోసం వేచి చూస్తున్నానంటున్నాడు ఈయన.