నిన్నమొన్నటి వరకు థియేటర్స్లో వీరంగం సృష్టించిన పుష్ప ఇప్పుడు ఓటిటిలో వచ్చేస్తున్నాడు. విడుదలైన నాలుగు వారాలకే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో మినహా అన్ని చోట్ల బ్లాక్బస్టర్ అయింది పుష్ప. యావరేజ్ టాక్ తట్టుకుని మరీ మాస్ స్టామినా చూపించాడు బన్నీ.
ఈయన కెరీర్లో మొదటి పాన్ ఇండియన్ సినిమాగా వచ్చింది పుష్ప. పెద్దగా ప్రమోషన్ లేకపోయినా కూడా హిందీ, తమిళంలోనూ మంచి వసూళ్లు సాధిస్తుంది పుష్ప. బాలీవుడ్లో అక్కడ ఇప్పటి వరకు 60 కోట్ల నెట్ వసూలు చేసింది. తమిళంలో కూడా సినిమా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. అక్కడ ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పైగా సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూసిన తర్వాత ప్రమోషన్లో మరింత జోరు పెంచుతున్నారు దర్శక నిర్మాతలు.
ఈ సినిమాను ఓటిటిలో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. దీనికి ఇప్పుడు సమాధానం వచ్చేసింది. ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా నెల రోజుల్లోనే ఓటిటిలో వస్తుంది. అయితే తెలుగులో మాత్రం కొన్ని పెద్ద సినిమాలకు 50 రోజుల గ్యాప్ ఉండాలని నిర్మాతలు ఈ మధ్యే నిర్ణయించుకున్నారు.
అన్నట్లుగానే కొన్ని సినిమాలు 50 రోజుల వరకు విడుదల కాలేదు కూడా. అయితే పుష్ప విషయంలో మాత్రం అలాంటి రూల్స్ ఏం పెట్టుకోలేదు. విడుదలైన 4 వారాల్లోనే సినిమాను ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ రేటుకు సొంతం చేసుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాను 40 రోజుల తర్వాతే విడుదల చేయాలనుకున్నారు.