చెట్టంత కొడుకు కళ్ల ముందు కన్నుమూస్తే ఆ తండ్రికి అంతకంటే దారుణమైన పరిస్థితి మరోటి ఉండదు. దురదృష్టవశాత్తు తెలుగు ఇండస్ట్రీలో కొందరు సినీ ప్రముఖులకు ఈ దారుణమైన పరిస్థితి కల్పించాడు ఆ దేవుడు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు కూడా కన్నుమూసారు. ఈయన కేవలం 56 ఏళ్ళ వయసులోనే అనారోగ్యంతో మరణించారు. వివాద రహితుడుగా ఉన్న రమేష్ బాబు మరణం అందర్నీ కలిచివేస్తుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ పరిస్థితి తలుచుకుని అంతా బాధ పడుతున్నారు.
మూడేళ్ల కింద భార్య విజయ నిర్మల చనిపోయినపుడు ఆయన కుంగిపోయారు. ఇప్పుడు కొడుకు కూడా వెళ్లిపోయాడు. దాంతో ఆయన్ని అంతా ధైర్యంగా ఉండాలని పరామర్శిస్తున్నారు. ఆ వయసులో కొడుకు మరణవార్త తెలిసి తల్లడిల్లిపోతున్నాడు కృష్ణ. తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ కంటే ముందు ఈ దారుణమైన పరిస్థితి మరికొందరికి కూడా ఎదురైంది. ముఖ్యంగా రమేష్ బాబు మరణం కంటే ముందు కొడుకులను పోగొట్టుకున్న తండ్రులు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ చాలా చిన్న వయసులోనే అరుదైన వ్యాధి వచ్చి అనారోగ్యంతో కన్నుమూసాడు. రామకృష్ణ మరణించినపుడు ఇరుగు పొరుగు షూటింగ్లో ఉన్నాడు అన్నగారు. అయినా కూడా అక్కడ షూటింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చారు. రామకృష్ణ మరణించిన విషయం జీర్ణించుకోడానికి చాలా రోజులు పట్టింది ఈయనకు. ఆ తర్వాత పుట్టిన కొడుకు రామకృష్ణ జూనియర్ అని నామకరణం చేసుకున్నాడు.
దివంగత నటుడు గొల్లపూడి మారుతిరావు తనయుడు శ్రీనివాస్ సైతం చిన్న వయసులోనే మరణించాడు. అజిత్ మొదటి సినిమా ప్రేమ పుస్తకం షూటింగ్ సమయంలోనే గొల్లపూడి కుమారుడు మరణించాడు. 1992 ఆగష్టు 12వ తేదీన ఎప్పటిలానే షూటింగ్ స్టార్ట్ చేసిన శ్రీనివాస్ ఊహించని ప్రమాదానికి గురయ్యాడు. వైజాగ్ బీచ్‌లోని ఒక బండమీద హీరోయిన్‌పై ఒక సీన్ షూట్ చేయడానికి సిద్దమైన శ్రీనివాస్‌ని ఒక పెద్ద అల దెబ్బకొట్టింది. అలతో పాటు శ్రీనివాస్ రెప్పపాటులో మాయమయ్యాడు. కాసేపటి తర్వాత చూస్తే శవమై కనిపించాడు. 26 ఏళ్ళకే శ్రీనివాస్ మరణించాడు.