ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సంచలన దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా వైడ్‌గా అన్ని భాషల్లోనూ అద్భుతం చేసింది పుష్ప. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బన్నీ మేనరిజమ్స్ ఫాలో అవుతున్నారు.
ఈ సినిమాలో బన్నీ నటనకు ఇప్పటికే ప్రశంసల జల్లు కురుస్తుంది. తాజాగా మరో అరుదైన గౌరవం పుష్ప సినిమాకు దక్కింది. తాజాగా ఈ చిత్రం దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ అవార్డ్ రావడంపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను హిందీ ఆడియన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరాది ప్రేక్షకుల కోసం కొన్ని మార్పులు చేస్తున్నారు. అక్కడి ఆడియన్స్ ఏం కోరుకుంటారో వాటిని జత చేయనున్నాడు దర్శకుడు సుకుమార్.
ఇప్పటి వరకు కేవలం యూ ట్యూబ్, శాటిలైట్లోనే అల్లు అర్జున్ సినిమాలు విజయం అందుకున్నాయి. వాటికి అక్కడ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం అలా మాత్రమే కాదు.. థియేటర్స్‌లో నేరుగా విడుదల చేసినా కూడా అంతే ప్రేమ చూపిస్తామని నార్త్ ఆడియన్స్ నిరూపించారు. అందుకే పుష్ప 2 సినిమాను బిగ్గెస్ట్ ఇండియన్ సినిమాగా విడుదల చేస్తామని తెలిపారు చిత్రయూనిట్.
సినిమాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ముందుగా 5 భాషల్లోని ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు పుష్ప దర్శక నిర్మాతలు. ఈ సినిమా 350 కోట్ల కలెక్షన్ వసూలు చేసిందని నిర్మాతలు ఇప్పటికే పోస్టర్ కూడా విడుదల చేసారు. ఇప్పుడు తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫిలిం అవార్డు రావడంతో సంతోషంగా ఉన్నారు ఫ్యాన్స్.