ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. తెలుగు మినహా మిగిలిన అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయిపోయింది. విడుదలైన నాలుగు వారాల్లోపే సినిమాను ఓటిటిలో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అందులో హిందీ వర్షన్ మాత్రం లేదు. ఇంకా అక్కడ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అందుకే మరికొన్ని రోజులు ఆగి హిందీ వర్షన్ విడుదల చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు దర్శక నిర్మాతలు.
ప్రైమ్ వీడియోలో పుష్ప సౌత్ వర్షన్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా పాటలకు (Pushpa movie songs) అయితే యూ ట్యూబ్‌లో పిచ్చెక్కిపోయే వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన వీడియో సాంగ్స్ రికార్డు వ్యూస్ అందుకుంటున్నాయి. అయితే అన్నీ ఒకెత్తు అయితే.. సమంత ఐటం సాంగ్ మాత్రం మరో ఎత్తు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఐటం సాంగ్ యూ ట్యూబ్‌లో సరికొత్త చరిత్ర తిరగరాస్తుంది. సమంత అందాలకు యూ ట్యూబ్ షేక్ అయిపోతుంది. పైగా సినిమాలో లేని విజువల్స్ ఈ పాటలో ఉన్నాయి. దాంతో మరింత ఎగబడుతున్నారు వ్యూవర్స్. సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా ఐటమ్ సాంగ్ కామన్. ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే ఐటం సాంగ్ పెడుతుంటాడు ఈయన.
ఆర్య సినిమాలోని 'ఆ అంటే అమలాపురం' నుంచి ఇప్పటి ఊ అంటావా వరకు ఎన్నో పాటలు వచ్చాయి. మధ్యలో ఆర్య-2 'రింగ రింగ'.. రంగస్థలం జిగేల్ రాణి లాంటి పాటలు దుమ్ము లేపాయి. ఇప్పుడు పుష్పలోనూ.. 'ఊ ఉంటావా.. ఊ ఊ అంటావా' పాట వంతు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పాటను అంతా తెగ పాడేసుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అంతా ఊ అంటావా అంటూ సందడి చేస్తున్నారు.