ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం వీరంగం సృష్టిస్తుంది. ఈ చిత్రం 17 రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్.. 155 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగులో ఇప్పటి వరకు సేఫ్ కాలేదు కానీ మిగిలిన భాషల్లో మాత్రం సినిమా బాగానే ఆడింది. యావరేజ్ టాక్ తట్టుకుని మరీ మాస్ స్టామినా చూపిస్తున్నాడు బన్నీ. ఈయన కెరీర్లో మొదటి పాన్ ఇండియన్ సినిమాగా వచ్చింది పుష్ప.
పెద్దగా ప్రమోషన్ లేకపోయినా కూడా హిందీ, తమిళంలోనూ మంచి వసూళ్లు సాధిస్తుంది పుష్ప. బాలీవుడ్లో అక్కడ ఇప్పటి వరకు 60 కోట్ల నెట్ వసూలు చేసింది. తమిళంలో కూడా సినిమా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. అక్కడ ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పైగా సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూసిన తర్వాత ప్రమోషన్లో మరింత జోరు పెంచుతున్నారు దర్శక నిర్మాతలు.
ఈ సినిమాను ఓటిటిలో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై సోషల్ మీడియాలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా నెల రోజుల్లోనే ఓటిటిలో వస్తుంది. అయితే తెలుగులో మాత్రం కొన్ని పెద్ద సినిమాలకు 50 రోజుల గ్యాప్ ఉండాలని నిర్మాతలు ఈ మధ్యే నిర్ణయించుకున్నారు. అన్నట్లుగానే కొన్ని సినిమాలు 50 రోజుల వరకు విడుదల కాలేదు కూడా.
అయితే ఇప్పుడు పుష్ప విషయంలో మాత్రం అలాంటి రూల్స్ ఏం లేనట్లుగానే కనిపిస్తుంది. ఈ చిత్రం అనుకున్న దానికంటే ముందుగానే ఓటిటిలో విడుదల అయ్యేలా కనిపిస్తుంది. అయితే ఈ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా ఓటిటి రిలీజ్ డేట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ రేటుకు సొంతం చేసుకుంది.
ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాను 40 రోజుల తర్వాతే విడుదల చేయాలనుకున్నారు కానీ సినిమా కలెక్షన్స్ తగ్గితే మాత్రం నాలుగు వారాల తర్వాత విడుదల చేయాలని ముందే అనుకున్నారు. ఇప్పటి వరకు సినిమా విడుదలై 18 రోజులు గడిచింది. మరో నాలుగు రోజుల్లోనే సినిమాను ఓటిటిలో విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
జనవరి 7న కానీ సినిమా విడుదలైందంటే సంక్రాంతికి ముందే ప్రతీ ఇంట్లో పుష్ప సందడి చేయడం ఖాయం. తెలుగు వర్షన్ మాత్రం ఆహాలో స్ట్రీమ్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. మిగిలిన వర్షన్స్ అన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానున్నాయి. అయితే తెలుగు వర్షన్ అమెజాన్‌తో పాటు ఆహాలో కూడా రానుందా.. లేదంటే ఒక్క ఆహాలోనే రానుందా అనేది మాత్రం సస్పెన్స్. ఇప్పుడు విడుదలైంది కేవలం మొదటి భాగం మాత్రమే. రెండో భాగం 2022లో విడుదల కానుంది. దీనికి పుష్ప ది రూల్ అనే టైటిల్ ఖరారు చేసారు. 2022 డిసెంబర్లో పార్ట్ 2 విడుదల కానుంది.