పుష్స సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో సంచలన విజయం అందుకోవడమే కాకుండా హిందీలోనూ మంచి మార్కెట్ సొంతం చేసుకున్నాడు బన్నీ. ఇదివరకే ఆయనకు హిందీలో మార్కెట్ ఉంది. కాకపోతే అది కేవలం యూ ట్యూబ్‌లో మాత్రమే కనిపించేది. ఆయన నటించిన సినిమాలు 300 మిలియన్ వ్యూస్ కూడా అందుకున్నాయి.
అత్యధిక 300 మిలియన్ వ్యూస్ అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. అయితే థియేటర్స్‌లో మొదటిసారి వచ్చినపుడు పుష్ప సినిమాకు అక్కడ ఆదరణ ఉంటుందా ఉండదా అని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా హిందీలో ఈ సినిమా 80 కోట్లకు నెట్ వసూలు చేసింది. అక్కడ బయ్యర్లకు ఏకంగా 35 కోట్ల లాభాలు తీసుకొచ్చాడు పుష్ప. కేవలం 10 కోట్లకు అమ్ముడయ్యాయి ఈ సినిమా రైట్స్.
కానీ సినిమాకు ఊహించని విధంగా వసూళ్ల సునామీ కురిసింది. ఫుల్ రన్లో 45 కోట్లకు పైగా షేర్ వచ్చింది. దాంతో బాలీవుడ్లో అల్లు అర్జున్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అందుకే ఈ క్రేజ్ వాడుకోడానికి బన్నీ గత సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురములో’ హిందీ వర్షన్ విడుదల చేయడానికి రెడీ అయ్యారు.
ఈ సినిమా ప్రమోషన్ కూడా వేగంగా చేసి.. జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ భారీ రేట్‌కు సొంతం చేసుకున్నారు గోల్డ్ మైన్స్ సంస్థ. అందుకే పుష్ప క్రేజ్ వాడుకోడానికి ఈ చిత్రాన్ని జనవరి 26న దేశవ్యాప్తంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాను హిందీలో కార్తిక్ ఆర్యన్, కియారా అద్వాని జంటగా ‘షెహజాదా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ అధినేత మనీష్ షా అల వైకుంఠపురములో చిత్ర విడుదలని ఆపేస్తున్నట్లుగా ప్రకటించాడు. అయితే హిందీ వర్షన్ థియేటర్లలో రిలీజ్ ఆపేసినా.. తన సొంత టీవీ ఛానల్ దించక్ టీవీలో ఫిబ్రవరి 6న ప్రీమియర్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి దీనిపై షెహ్జాదా టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.