తెలుగు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ కంటే మాస్టర్ మైండ్ మరొకరు లేరు. కాలం మారుతుందని.. ట్రెండ్‌కు తగ్గట్లుగా మనం కూడా మారాలని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాడు ఈయన. ప్రేక్షకులకు థియేటర్స్‌కు వచ్చే టైమ్ లేక ఎక్కువగా ఓటిటి సంస్థల వైపు అడుగులు వేస్తున్నారు. ఇదే అదునుగా తెలుగులోనూ 100 పర్సెంట్ ఓటిటి అంటూ ఆహాను మొదలు పెట్టాడు అల్లు అరవింద్. తెలుగులో ఓటిటి ఎవరు చూస్తారని ముందు హేళన చేసినా.. దాన్ని సక్సెస్ చేసి చూపించాడు అల్లు అరవింద్.
మొదట్లో ఇది సక్సెస్ కాకపోయినా.. కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు తన ఆహాను తెలుగు వాళ్లకు బాగా చేరువ చేసాడు ఈ నిర్మాత. ఇప్పుడు ఆహా తెలుగులో దూసుకుపోతుంది. మంచి కంటెంట్ ఇస్తూ.. తెలుగు వాళ్లకు యిష్టమైన యాప్ అయిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళంలోనూ ఆహా ఓటిటిని లాంఛ్ చేసాడు నిర్మాత అల్లు అరవింద్. దీని ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలోని ఓ హోటల్లో జరిగింది.
ఆడంబరంగా జరిగిన ఈ వేడుకకు చాలా మంది తమిళ సినీ ప్రముఖులు వచ్చారు. కుటుంబ కథా చిత్రాల నిర్మాత ఆర్బి చౌదరి, అగ్ర నిర్మాత కలైపులి ఎస్.థాను, దర్శకుడు కె ఎస్ రవికుమార్, శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్ దంపతులు, నటుడు దర్శకుడు ఎస్.జె.సూర్య, సీనియర్ హీరోయిన్ ఖుష్భు, కె.భాగ్యరాజ్, దర్శకుడు పా.రంజిత్, హీరో జయం రవి, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, దర్శకుడు శివ పాల్గొన్నారు.
తమిళ హీరో జయం రవి , సంగీత దర్శకుడు అనిరుధ్ 'ఆహా' లోగోను ఆవిష్కరించారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆహా గురించి ఎమోషనల్ అయ్యాడు. ఈ యాప్ నుంచి 100 శాతం ఎంటర్టైన్మెంట్ అందిస్తామని తమిళ ప్రేక్షకులకు హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన బాల్యం గురించి గుర్తు చేసుకున్నాడు అల్లు అరవింద్. తాను పుట్టి పెరిగింది మొత్తం చెన్నైలోనే అని చెప్పాడు ఈయన. తన డిగ్రీ కూడా ఇక్కడే పూర్తయిందని తెలిపాడు.
అప్పటి రోజులను గుర్తు చేసుకుని కొంత ఎమోషనల్ అయ్యాడు అల్లు అరవింద్. 20 ఏళ్ల కింద చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్లి.. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత తిరిగిరావడం చాలా సంతోషంగా ఉందన్నాడు అల్లు అరవింద్. ఎంతలా అంటే అమ్మాయి పుట్టింటికి వస్తే ఎంత సంతోషపడుతుందో.. తనకు కూడా అలాగే ఉందని చెప్పాడు ఈయన. మొదట్లో భారీ సినిమాల వైపు చూడని ఆహా.. ఇప్పుడు అన్నింటి కొనేస్తుంది.
ముఖ్యంగా లోకల్ కంటెంట్ ఎక్కువగా తమ వైపు తీసుకుంటుంది ఆహా. మరోవైపు బాలయ్య లాంటి అగ్ర హీరోతోనూ టాక్ షోలు చేస్తూ సూపర్ హిట్ అయింది ఆహా. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ డిజే టిల్లు రైట్స్ కూడా ఆహానే తీసుకుంది. మరోవైపు తమిళ హీరో కార్తీ నటిస్తున్న 'సర్దార్' తమిళం డిజిటల్ రైట్స్ కూడా 'ఆహా' దక్కించుకుంది. మొత్తానికి తెలుగులో రచ్చ చేస్తున్న ఆహా.. తమిళంలో ఏం చేయబోతుందో చూడాలి.