భారీ అంచనాలతో మొదలైన బాలయ్య అన్స్టాపబుల్ షో అప్పుడే ఆగిపోవడంతో నందమూరి అభిమానులు మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. అయ్యో అదేంటి.. అంత భారీగా మొదలుపెట్టి అప్పుడే ఆపేసారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు బాలయ్య షో ఎందుకు ఆగిపోయింది.. అంత హంగామా చేసిన అన్స్టాపబుల్కు బ్రేకులు పడటానికి కారణం ఏంటా అని తెగ వెతికేస్తున్నారు.
ఆహా వేదికగా ఈ షో మొదలైంది. నవంబర్ 4న దివాళీ ముహూర్తం చూసుకుని మరీ మొదలుపెట్టారు. మొదటి ఎపిసోడ్ మోహన్ బాబుతో సూపర్ హిట్ అయింది. దానికి వ్యూస్ కూడా అద్భుతంగా వచ్చాయంటూ హంగామా చేసారు ఆహా యూనిట్. ఇప్పటి వరకు ఆహా మొదలైన తర్వాత.. దేనికి రానంత రెస్పాన్స్ బాలయ్య షోకు వచ్చిందంటూ వాళ్లు పండగ చేసుకున్నారు.
ప్రస్తుతానికి బ్రేకులు పడినా.. మళ్లీ దూసుకొస్తాడు బాలయ్య అంటూ చెప్పారు వాళ్లు. అప్పటి వరకు నా గురించి మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు అంటూ డైలాగులు కూడా చెప్పాడు. కానీ మూడో ఎపిసోడ్ కోసం ఎన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడనేది మాత్రం అర్థం కావడం లేదు. కొన్నిచోట్ల ఈ షో పూర్తిగా ఆగిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే అందులో నిజం లేదు.. బాలయ్యకు ఆ మధ్య హ్యాండ్ సర్జరీ కావడంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడంతే అంటున్నారు. మరోవైపు తన అఖండ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ఆ ప్రమోషన్ కారణంగా షోకు దూరంగా ఉన్నాడని తెలుస్తుంది. డిసెంబర్ 2న అఖండ సినిమా విడుదల కానుంది. బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.