సంక్రాంతికి ఎలాంటి సినిమాలు వస్తాయని ప్రేక్షకులు కలలు కన్నారో వాటికి పూర్తిగా భిన్నంగా జరుగుతుంది. 1000 కోట్ల మార్కెట్ జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు 100 కోట్లు జరిగితే అదే గొప్ప విషయంలా కనిపిస్తుంది. అనుకోకుండా ట్రిపుల్ ఆర్ రేసు నుంచి తప్పుకోవడంతో నిర్మాతలకు కూడా ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఎందుకంటే రాజమౌళి సినిమా వస్తుందని ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి.
సర్కారు వారి పాట ఎప్పుడో రాజమౌళి కోసం సైడ్ ఇచ్చింది. ఇక భీమ్లా నాయక్ సినిమాను అయితే పట్టుబట్టి మరీ పోస్ట్ పోన్ చేయించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రానుంది. మరోవైపు భారీ అంచనాలతో వస్తున్న రాధే శ్యామ్ సైతం వచ్చే వరకు గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇది కూడా పాన్ ఇండియన్ సినిమానే. ట్రిపుల్ ఆర్ సినిమాకు వర్కవుట్ కానివేవీ దీనికి కూడా కావు.
హిందీతో పాటు తమిళ, మలయాళంలో కూడా రాధే శ్యామ్ భారీగానే విడుదల కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ఇప్పటి వరకు రాధే శ్యామ్ నిర్మాతలు మాత్రం వాయిదాపై ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ అనధికారికంగా మాత్రం రాధే శ్యామ్ పోస్ట్ పోన్ అయిన విషయం అర్థమవుతుంది. ఎందుకంటే జనవరి 14న డిజే టిల్లు అనే చిన్న సినిమా ఒకటి విడుదల కానుంది.
ఆ మరుసటి రోజే హీరో అంటూ మహేష్ బాబు అల్లుడు గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ సినిమా విడుదల కానుంది. జనవరి 14న రాధే శ్యామ్ వస్తే.. అదే రోజు డిజే టిల్లు అనే మరో సినిమా ఎందుకొస్తుంది.. అసలు థియేటర్స్ ఎక్కడ దొరుకుతాయి..? పైగా ఆ సినిమాను నిర్మిస్తున్నది ఎవరో కాదు సితార ఎంటర్టైన్మెంట్స్. రాధే శ్యామ్ పోస్ట్ పోన్ అయిందనే క్లారిటీ వాళ్లకు వచ్చుంటుంది కాబట్టే కదా.. ఆ డేట్ మరో సినిమా తీసుకుంది..?
ఈ సంక్రాంతికి నాగార్జున ఒక్కడే ధైర్యం చేసేలా కనిపిస్తున్నాడు. ఈయన నటిస్తున్న బంగార్రాజు సినిమా జనవరి 15న విడుదల కానుంది. ముందు నుంచి చెప్పినట్లుగానే ఈయన తన సినిమాను పండక్కి తీసుకొస్తున్నాడు. మీడియం బడ్జెట్ సినిమా కావడంతో దీనకి పెద్దగా సమస్యలు లేకపోవచ్చు. మొత్తానికి ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ అంటూ సంక్రాంతికి కలలు కంటే.. హీరో, డిజే టిల్లు లాంటి సినిమాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.