డయాబెటిస్ వచ్చేందుకు ముందు స్థాయిని ప్రీ డయాబెటిక్ కండిషన్ అని అంటారు. ఈ దశలో కాస్త జాగ్రత్త పడితే డయాబెటిస్ ముప్పును తగ్గించుకోవచ్చు. తిరిగి ఆరోగ్యంగా మారే వీలుంటుంది. ఈ దశలో జాగ్రత్త పడేందుకు మీ శరీరం మీకు కొన్ని లక్షణాలను కూడా చూపిస్తుంది. వీటినే డేంజర్ సిగ్నల్స్ గా భావించి తొందరపడడం మంచిది. ఆ లక్షణాలేంటంటే..
సాధారణంగా నీళ్లు ఎక్కువగా తాగడం మంచి పద్ధతే కానీ ఎన్ని నీళ్లు తాగినా మీకు ఇంకా దాహంగా అనిపిస్తుంటే మాత్రం ఒకసారి మీ షుగర్ లెవల్స్ చెక్ చేయించుకోవడం మంచిది. మీకు డయాబెటిస్ ఉన్నప్పుడు మీ కిడ్నీలు సాధారణం కంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తూ మీ శరీరంలోని గ్లూకోజ్ ని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ గ్లూకోజ్ మొత్తం మూత్రంలో భాగంగా బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వల్ల అది చర్మ కణాల నుంచి ఎక్కువగా ఉన్న నీటిని కూడా లాగేస్తుంది. ఈ క్రమంలో మన చర్మం కూడా పొడిబారిపోతుంది. చర్మం పొడిగా ఉండడం వల్ల దురద ఎక్కువగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం చర్మ కణాలే కాదు.. నరాలను కూడా ఇది నాశనం చేస్తుంది. అందుకే కాళ్లలో తిమ్మిరి వచ్చినట్లు, మొద్దుబారినట్లు అనిపిస్తుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇన్సులిన్ తక్కువగా ఉండడం వల్ల కొత్త కణాలు ఏర్పడడం కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇది గాయాలు తగ్గే శక్తిని తగ్గిస్తుంది. దీంతో గాయాలు మానేందుకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. దీంతో పాటు రక్తనాళాలను కూడా రక్తంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ నాశనం చేయడం వల్ల రక్త నాళాలపై అక్కడక్కడా చిన్న చిన్న పుండ్లు కూడా ఏర్పడుతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మన శరీరంలో శక్తి కావాలంటే గ్లూకోజ్ ఉండాలి. గ్లూకోజ్ బయటకు వెళ్లిపోవడం వల్ల చాలా మంది శరీరాలు కొవ్వు నుంచి తమకు కావాల్సిన శక్తిని పొందుతాయి. అందుకే ఇలాంటివారు బరువు తగ్గే వీలుంటుంది. అయితే ఇది ఆరోగ్యకరమైన బరువు కాదు. అందుకే మీరేం చేయకపోయినా బరువు తగ్గుతుంటే చక్కెర స్థాయులు ఎక్కువగా ఉన్నాయని గుర్తించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ లక్షణాలు మీకుంటే మీకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే మీకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వ్యాయామం చేసే అలవాటు లేకపోయినా, బరువు ఎక్కువగా ఉన్నా డయాబెటిస్ వచ్చే అవకాశాలుంటాయి. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారు, హై బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నా కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)