మీరు ఏదో పనిలో బిజీగా ఉంటారు. అప్పుడు మెల్లగా మీ మెడ వెనక భాగంలో భుజాల దగ్గర ఏదైనా నొప్పి లాంటిది వస్తోందా? అదే తగ్గుతుందిలే అని దాన్ని లైట్ తీసుకోకండి. ఎందుకంటే... ఆ నొప్పి... అంతకంతకూ పెరుగుతుందే తప్ప వదలదు. చిరాకొచ్చి పని కూడా చెయ్యబుద్ధి కాదు. ఆ పని వదిలేస్తే తప్ప ఆ నొప్పి తగ్గదు. కానీ పని మానేయలేం కదా. కాబట్టి నొప్పిని భరిస్తూ... కొంత మంది పనిచేస్తూ ఉంటారు. అసలా నొప్పి ఎందుకు వస్తుందో తెలిస్తే... దాని అంతు చూడొచ్చు. అది తెలుసుకుందాం.
మనం కూర్చునే ప్రదేశం, కూర్చునే విధానం సరిగ్గా ఉండకపోతే... ఈ మెడ, భుజాల నొప్పి మొదలవుతుంది. ఆరోగ్య నిపుణులు దీనికి మూడు మార్గాలు చెబుతున్నారు. పని మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. బెడ్‌పైకి ల్యాప్‌టాప్ తీసుకెళ్లకూడదు. ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే... ఇలాంటి నొప్పులు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. కానీ... కూర్చొనే ల్యాప్‌టాప్, సిస్టం లాంటి వాటిలో పని చేయాల్సి వస్తే మాత్రం... ఈ నొప్పి మొదలవుతుంది.
ఇలాంటి చిన్న నొప్పులే భవిష్యత్తులో సెర్వికల్ పెయిన్, బ్యాకాచ్. ఆర్తరైటిస్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ముందు మీరు చెయ్యాల్సింది. మీ కీబోర్డు... మీ మోచేతుల కంటే కిందకు ఉండేలా చేసుకోవాలి. మీరు కూర్చునే విధానంలో మీ మోచేతుల కంటే... కీబోర్డు ఎత్తుగా ఉంటే... మరీ మీ కుర్చీ హైట్ పెంచుకొని కూర్చోవాలి. లేదా... కీబోర్డ్ ఎత్తు తగ్గించాలి. ఏం చేసైనా సరే... మోచేతులే ఎత్తుగా ఉండాలి. లేదంటే భుజం నొప్పి భరించాల్సి వస్తుంది.
ఎన్ని పని ఒత్తిళ్లు ఉన్నా... రెగ్యులర్‌గా యోగా, ఎక్సర్సైజ్ వంటివి చేస్తూ ఉండాలి. ఇవి కండరాల్లో కదలికలు పెంచి... రక్త ప్రసరణ బాగా అయ్యేలా చేసి... అడ్డమైన నొప్పుల నుంచి కాపాడతాయి. రోజూ కనీసం గంటైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలంటున్నారు. ఇందుకోసం మెట్లు ఎక్కి దిగడం, గార్డెన్లో మొక్కల పని చెయ్యడం, ఇంట్లో బట్టలు ఉతుక్కోవడం, వంట చేసుకోవడం, బూజు దులుపుకోవడం, వాహనాల్ని క్లీన్ చేసుకోవడం, ఇంటీరియర్ డెకరేషన్, కుక్కకు స్నానం చేయించడం ఇలా ఎన్నో పనులను కావాలని కల్పించుకోవడం ద్వారా... బాడీలో కొవ్వు కరిగిపోయి... ఫిట్‌గా ఉంటారని చెబుతున్నారు.
ల్యాప్ అంటే ఒడి. టాప్ అంటే ఒడిలో పెట్టుకొనేది అనే అర్థం కదా. కానీ... ల్యాప్‌టాప్‌ని ఒడిలో పెట్టుకొని మాత్రం పని చెయ్యకూడదు. అది బ్యాక్ పెయిన్ వచ్చేందుకు దారి తీస్తుంది. తప్పనిసరిగా ఓ టేబుల్, చైర్ ఉండాల్సిందే. టేబుల్ ముందు చైర్లో స్ట్రైట్‌గా, నిఠారుగా కూర్చోవాలి. ఏదో పోగొట్టుకున్నట్లుగా దిగాలుగా కూర్చోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎక్కడ కూర్చున్నా... రెండు గంటలకోసారి లేచి... అలా ఓ రౌండ్ వేసి రమ్మంటున్నారు. తద్వారా కండరాలు కాస్త కదిలి... ఫ్రీ అవుతాయని చెబుతున్నారు. ఇక పని ఒత్తిడిలో ఆ కరకరలాడే స్నాక్స్ వంటివి ఎక్కువ తినొద్దని చెబుతున్నారు. అవి టెన్షన్ తగ్గించకపోగా... బరువు పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. వాటి పదులు పండ్లు, జ్యూస్, డ్రాఫ్రూట్స్, పప్పులు, గింజల వంటివి తినమని సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు కూడా తాగాలంటున్నారు.