ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఏది అని ఎవరైనా ప్రశ్నిస్తే... మీరు రూబీ రోమన్ గ్రేప్ (Ruby Roman Grape) అని ఆన్సర్ ఇవ్వొచ్చు. ప్రపంచంలో ఖరీదైన పండ్లను పండించే దేశం జపాన్ అని మనకు తెలుసు. ఈ ద్రాక్షను కూడా పండిస్తున్నది ఆ దేశ రైతులే. వీటి ధర ఒక గుత్తు రూ.8లక్షలకు పైనే. అందుకే గిన్నీస్ బుక్‌లో కూడా ఎక్కేశాయి.
మన దేశంలో సాధారణ ద్రాక్షపండ్ల ధర కేజీ రూ.100 అని చెబితే.. రూ.80కి ఇస్తారా అని కొంత మంది బేరం ఆడుతుంటారు. ఎందుకంటే ఇండియాలో ధరలు బాగా పెరుగుతున్నాయి. రూపాయి విలువ పడిపోతోంది. ఒకప్పుడు రూపాయి ఉండే మొక్కజొన్న కండి ఇప్పుడు 20 రూపాయలు. ఒకప్పుడు పావలా ఉండే జామకాయ ఇప్పుడు 5 రూపాయలు. ధరలు పెరిగినట్లుగా ప్రజల దగ్గర డబ్బు పెరగట్లేదు. అందుకే బేరాలు ఆడుతుంటారు.
జపాన్‌లో పండ్ల ప్రాసెసింగ్ చాలా కఠినంగా ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత ప్రాసెసింగ్ జరుపుతారు. వేర్వేరు దశల్లో పరీక్షలు జరుపుతారు. ఈ కాస్ట్లీ ద్రాక్ష విషయంలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ ద్రాక్షలో 3 రకాలున్నాయి. సుపీరియర్, స్పెషల్ సుపీరియర్, ప్రీమియం. అత్యధిక క్వాలిటీ ఉండేవి ప్రీమియం ద్రాక్ష. రిపోర్టుల ప్రకారం 2021లో 2 గుత్తులను మాత్రమే ప్రీమియం గ్రేడ్‌గా నిర్ణయించారు. 2019, 2020లో ఏ గుత్తుకీ ఈ గ్రేడ్ ఇవ్వలేదు.