ఈ రోజుల్లో కిడ్నీలలో రాళ్లు ఏర్పడటాన్ని చాలామంది ప్రజలు పెద్ద సమస్యగా పరిగణించట్లేదు. కానీ చిన్న వయసులోనే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల దీర్ఘకాలంలో మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండంలో కొన్ని రకాల రసాయన సమ్మేళనాలు గట్టిపడి రాళ్లుగా మారుతాయి. వీటివల్ల మూత్ర విసర్జన సమసయంలో విపరీతమైన నొప్పి, పొత్తికడుపు నొప్పి, వికారం వంటివి వేధిస్తాయి.
ఈ లక్షణాలు ఎక్కువ రోజులు కనిపిస్తే కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని అనుమానించాలి. ఈ రాళ్లు చిన్నవిగా ఉంటే మూత్రంతో పాటు బయటకు వెళ్లిపోతాయి. కానీ ఇవి పెద్దగా ఉంటే మాత్రం ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి ఉంటుంది. సమస్య వచ్చిన తరువాత ఇబ్బందులు ఎదుర్కోవడానికి బదులుగా ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనికి దూరంగా ఉండవచ్చు. ఆహారం, సరైన జీవనశైలి ద్వారా సహజంగానే కిడ్నీల్లో రాళ్లకు దూరంగా ఉండవచ్చు.
కొన్ని సహజ పద్ధతుల ద్వారా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. నిమ్మరసారికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడే లక్షణాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. కిడ్నీల్లో రాళ్లను నిరోధించేందుకు ఉన్న సహజ మార్గం, నీరు ఎక్కువగా తాగడం. ఒకవేళ కిడ్నీల్లో చిన్నపాటి రాళ్లు ఉన్నా, అవి మూత్రంతో పాటు బయటకు వెళ్లిపోవడానికి తగినంత నీరు తాగాలి.
ఎక్కువ మొత్తంలో నీరు తాగడానికి ఇష్టపడని వారు జ్యూసులను తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా నిమ్మరసం తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం చాలావరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయల్లో ఎక్కువ గాఢత ఉండే సిట్రేట్ ఉంటుంది. ఇది రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఆమ్ల స్వభావం ఉండే సిట్రేట్, మూత్రపిండాల్లో రాళ్లకు దారితీసే కాల్షియం స్ఫటికాలు ఏర్పడకుండా చూస్తుంది. చిన్న పరిమాణంలో ఉండే రాళ్లను కరిగించి, బయటకు పంపే శక్తి కూడా నిమ్మరసానికి ఉంటుందని పరిశోధనల్లో తేలింది.