మన వంటింట్లో రకరకాల మూలికలు, సుగంధద్రవ్యాలు ఉంటాయి. ఇంట్లో పెద్ద వాళ్లు ఉంటే.. వాళ్ల ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్లు ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలం కాబట్టి.. వాళ్ల ఆరోగ్యాన్ని పెంచే మూలికల్ని మనం తప్పక ఇంట్లో ఉంచుకోవాలి. అసలే బయట పొల్యూషన్ ఎక్కువవుతోంది. పెద్దవాళ్లకు శ్వాస సరిగా ఆడదు. ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆస్తమా, నిమోనియా, బ్రాంకైటిస్ ఉన్న వారి ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అవి బాగా పనిచేసేలా చేసేందుకు కొన్ని మూలికలున్నాయి. అవి తెలుసుకుందాం.
Ginger : అల్లంను శతాబ్దాలుగా మందుల తయారీలో వాడుతున్నారు. ఇది నొప్పి, మంటను తగ్గించే గుణాలు కలిగివుంది. శ్వాస సరిగా అందని వారికి కలిగే ఛాతి నొప్పి, మంటను అల్లం తగ్గిస్తుంది. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు, అలర్జీలను ఇది అడ్డుకుంటుంది. ఇది గొంతులో కఫం (Mucus)ని తగ్గించగలదు. అల్లంని వంటల్లో వాడాలి. అలాగే అల్లం టీ తాగడం మేలు. అల్లం చెట్నీ కూడా మంచిదే.
Peppermint : పుదీనాను రోజూ వాడండి. ఇంట్లో పుదీనా మొక్కలు పెంచుకుంటే.. కావాల్సినప్పుడల్లా నాలుగు ఆకులు తెంపుకొని వాడొచ్చు. పుదీనాలో మెంథాల్ (Menthol) ఉంటుంది. దీనికి చల్లబరిచే గుణం ఉంటుంది. ఇది శ్వాస సంబంధిత మంటను తగ్గించి.. శ్వాస నాళాలు తెరచుకునేలా చెయ్యగలదు. తద్వారా ఊపిరి పీల్చుకోవడం తేలికవుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఉన్నవారికి పుదీనా బాగా పనిచేస్తుంది. దీన్ని చాలా రకాలుగా వాడొచ్చు. పుదీనా డ్రింక్ తాగొచ్చు, పుదీనా టీ తాగొచ్చు, పుదీనాను ఆవిరి పట్టుకోవచ్చు. పుదీనా తైలాన్ని వాడొచ్చు.
Turmeric : పసుపును ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు. ఇందులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కూడా శ్వాస సంబంధిత సమస్యలను దూరం చెయ్యగలదు. ఇది ఛాతిలో మంట, నొప్పిని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను పోగొడుతుంది. మందులు వాడటం కంటే పసుపు వాడటం వల్ల డైరెక్ట్ ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపును మనం వంటల్లో, టీలో, పాలలో వాడొచ్చు. ఈ రోజుల్లో పసుపు ట్యాబ్లెట్స్ కూడా లభిస్తున్నాయి.
Tulsi : తులసి ఎంత మంచిదో చెప్పాల్సిన పనిలేదు. ఆ మొక్క గొప్పదనం తెలుసుకాబట్టే.. శతాబ్దాలుగా పూజలు అందుకుంటోంది. తులసి మొక్క మొత్తం ఔషధ గుణాలే ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, జింక్, విటమిన్ సీ ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తి (immunity)ని పెంచుతాయి. రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి తులసి మనల్ని కాపాడగలదు. అలాగే శ్వాస సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో రక్త ప్రవాహం చక్కగా సాగేలా చెయ్యగలదు.
Pippali : ఇది మనకు పెద్దగా తెలియదు అనుకుంటాం గానీ.. మన ఇండియాలో కొంతమంది వంటింట్లో దీన్ని కూడా బాగా వాడుతారు. ఎందుకంటే ఇది జలుబు, దగ్గును బాగా తగ్గించగలదు. ఆయుర్వేదంలో దీన్ని బాగా వాడుతారు. ముసలివారికి శ్వాస సమస్యల్ని తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. మీకు షాపుల్లో లేదా ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో ఇది లభిస్తుంది. ఇది ఊపిరితిత్తుల్ని రిపేర్ చెయ్యగలదు. చాలా మంది పిప్పాలీ పొడిని, తేనెతో కలిపి తీసుకుంటారు. తద్వారా శ్వాస సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. (image credit - twitter - @drravidhaliya)
ఇంకా ఇలాంటి మూలికలు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ ఎక్కడబడితే అక్కడ లభించవు. పైగా అన్నీ, అందరికీ సెట్ కావు. ఇవైతే ఎక్కువ మంది వాడుతున్నారు. కాబట్టి వీటిని మన ఇళ్లలో కొద్దికొద్దిగా వాడుకోవడం మంచిదే. ఆరోగ్యమే మహా భాగ్యం కదా.. మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కాబట్టి.. వీటిని వాడటం మేలని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.