పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిని వండే పనిలేకుండా డైరెక్టుగా తింటాం కాబట్టి.. వీటిలోని పోషకాలు మనకు డైరెక్టుగా అందుతాయి. పైగా వీటిలోని సుక్రోజ్.. రక్తంలో గ్లూకోజ్‌గా మారి మనకు ఎనర్జీని ఇస్తుంది. పండ్లలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ వంటివి అనారోగ్యాలు రాకుండా కాపాడతాయి. ఐతే.. నానాటికీ పండ్ల ధరలు పెరిగిపోతున్నాయి. ఇలాంటప్పుడు మనం ఏ పండ్లను ఎక్కువగా కొనాలో, ఏవి తక్కువగా కొనాలో చూద్దాం.
బత్తాయి తొక్కలు, లోపలి తొనలు, గింజలు అన్నీ కలిపి.. కేజీ బత్తాయిలో... అరకేజీ అవే ఉంటాయి. అందువల్ల వాస్తవంగా రూ.50కి లభించేది అరకేజీ మాత్రమే. అదే యాపిల్‌లో తుక్కు కేజీకి 100 గ్రాములే ఉంటుంది. కాబట్టి యాపిల్ కేజీ కొంటే... దాదాపు 900 గ్రాములు ఫ్రూట్ లభిస్తుంది. ద్రాక్షలోనూ అంతే.. గుత్తులో ఉన్న కాడలు తప్పితే.. తుక్కు పెద్దగా ఉండదు. కాబట్టి.. కేజీ ద్రాక్ష కొంటే.. దాదాపు 920 గ్రాములు ఫ్రూట్ లభిస్తుంది. ఈ లెక్కన బత్తాయి కంటే.. యాపిల్, ద్రాక్ష కొనడం మేలు.
ఈ ఫార్ములా ప్రకారం... మార్కెట్‌కి వెళ్లినప్పుడు మనం పండ్ల ధరలను మాత్రమే కాకుండా... వాటి ద్వారా ఎంత తుక్కు వస్తుందో కూడా లెక్కలోకి తీసుకోవాలి. ధర తక్కువగా ఉండి, తుక్కు కూడా తక్కువగా వచ్చే పండ్లను కొనడం వల్ల ఎక్కువ లాభం పొందుతాం. ఈ ఫార్ములా ప్రకారం.. అరటి, ద్రాక్ష, జామ లాంటివి ఎక్కువగా కొనుక్కోవాలి, తుక్కు ఎక్కువగా మిగిలే పండ్లను తక్కువగా కొనుక్కోవాలి.
ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. అన్ని రకాల పండ్లనూ తినాలి కదా అనే ప్రశ్న. నిజమే.. సీజన్‌ని బట్టీ అన్ని రకాల పండ్లనూ తినాలి.. ఐతే.. ప్రతీ సీజన్లోనూ దాదాపు 10 రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటికి ఈ తుక్కు ఫార్ములాను అప్లై చేసి కొనుక్కోవచ్చు. ఇక ఈ విటమిన్లు దాదాపు అన్ని పండ్లలోనూ ఉంటాయి. ఎక్కువగా సీ విటమిన్ అన్ని పండ్లలో లభిస్తుంది. అందువల్ల తుక్కు తక్కువగా వచ్చేవి, ధర తక్కువగా ఉండేవి కొనుక్కోవడం ద్వారా... మీరు ఇచ్చే మనీకి ఎక్కువ ప్రయోజనం పొందుతారు.