* ఊలాంగ్ టీ తయారీ విధానం : గ్రీన్ టీ, బ్లాక్ టీని తయారు చేయడానికి ఉపయోగించే కామెల్లియా సైనెసిస్ మొక్క ఆకుల నుంచే ఊలాంగ్ టీను తయారు చేస్తారు. గ్రీన్ టీ, బ్లాక్ టీలతో పోలిస్తే ఊలాంగ్ టీ తయారీలో కామెల్లియా సైనెసిస్ మొక్క ఆకులను ప్రాసెస్ చేసే విధానం వేరుగా ఉంటుంది. కామెల్లియా సైనెసిస్ మొక్క ఆకులు గాలికి ఉంచినప్పుడు రసాయన చర్య జరుగుతుంది. దీన్ని బట్టి టీ రంగు, రుచి మారుతుంది.
వీటి ఆధారంగా టీలను వేర్వేరు పేర్లతో పిలుస్తున్నారు. సాధారణంగా గ్రీన్ టీ కోసం ఆక్సీకరణ చెందని కామెల్లియా సైనెసిస్ మొక్క తాజా ఆకులను ఉపయోగిస్తారు. ఇక, బ్లాక్ టీ కోసం ఈ ఆకులను ఆక్సీకరణ చెందడానికి పూర్తిగా చూర్ణం చేస్తారు. ఊలాంగ్ టీ తయారీ కోసం ఈ ఆకులు పాక్షికంగా ఆక్సీకరణ చెందడానికి ఎండలో కొద్దిసేపు ఉంచుతారు. ఈ ఆకులు వడలిపోయి కొద్దిగా ఎండిన తరువాత వాటితో ఊలాంగ్ టీ తయారు చేస్తారు.
* ఊలాంగ్ టీలోని పోషకాలు : తాజాగా తయారుచేసిన ఒక కప్పు ఊలాంగ్ టీలో ఖనిజాలు, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఈ టీ తాగితే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. టీ పాలీఫెనాల్స్గా పిలువబడే థెఫ్లావిన్స్, థియారూబిగిన్స్, EGCG వంటి యాంటిఆక్సిడెంట్స్కు ఇది పవర్ హౌస్ లాంటిది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
* గుండె ఆరోగ్యం మెరుగు : ఊలాంగ్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఈ టీని తరచూ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాధారణంగా గ్రీన్, బ్లాక్ టీలతో పోల్చితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మ్యుటాజెనిక్ ప్రభావం ఎక్కువగా ఉంటందని అని పరిశోధనల్లో తేలింది. ఈ ప్రభావం కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.