Karthika Masam Vanabhojanam Special: తెలుగు రాష్ట్రా (Telugu States)ల్లో అప్పుడే కార్తిక సందడి మొదలైంది. చాలామంది ఇప్పటికే పికినిక్ లు.. వనభోజనాలకు ఎక్కడకు వెళ్తే బెటర్ అంటు ప్లాన్ లు వేసుకుంటున్నారు. ఎందుకంటే కార్తీక మాసం (Karthika Masam)మించిన మాసం లేదని పురాణాల కథనం. కార్తీక మాసం వస్తూనే శివకేశవులను ఏకం చేస్తూ పూజ (Pooja)లతో సందడి తీసుకొస్తుంది.
ఇక ఈ మాసంలో తెలుగువారి లోగిళ్ళు రోజూ పండగ శోభతో కళాకళాడతాయి. అదే సమయంలో వనభోజనాల సందడి మొదలవుతుంది. ఈ వనభోజనాల ప్రస్తావన అనేక ధార్మిక గ్రంథాలతో పాటు ‘కార్తీక పురాణం’ (Karika puranam)లో కూడా ఉంది. కార్తీక పౌర్ణమి రోజున నైమిశారణ్యంలో మునులు అందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు చేశారని పూర్వికులు చెబుతూ ఉంటారు.
మునులు ఉసిరి చెట్టుకింద విష్ణువుని ప్రతిష్టించి పూజలను నిర్వహించి.. గోవింద నామస్మరణతో ఓం నమ: శివాయ షోడశోపచారాలతో పూజలు చేసి.. తరువాత వనభోజనాలు చేశారు.అలా మహర్షులు మొదలు పెట్టిన కార్తీకవనభోజనాల కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెబుతున్నారు. స్నేహితులు (Friends), కుటుంబ (Family) సభ్యులు ఇలా చాలామంది కార్తీక మాసంలోని వనభోజనాల వేడుకని నిర్వహిస్తారు. ఈ వన భోజనాలు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం,ఆరోగ్యాన్ని ఇస్తాయి.
భారతీయ ఆయుర్వేద (Ayurveda) వైద్యంలో మొక్కలు ఉన్న ప్రాధ్యాన్యత తెలిసిందే. పూర్వకాలం నుంచి మొక్కలను ప్రకృతి వరంగా భావించి పూజిస్తుంటారు. ఇక ఆయుర్వేదంలో ప్రాముఖ్యమున్న చెట్టు ఉసిరి చెట్టు. కార్తీక మాసంలోని ఉషోదయ వేళల్లో మంచుకురిసే సమయంలో ఉసిరి చెట్టుకింది విష్ణువుని పూజించి ఆహారం ఆ చెట్టుకింద తినడం వలన పుణ్యమని కార్తీకపురాణం చెబుతోంది. ఈ మాసంలో ఉసిరి చెట్టుకింద విష్ణువుకు చేసే పూజ అశ్వమేధయాగ ఫలాన్ని ఇస్తుందని హిందువుల నమ్మకం.
కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం,ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతున్నాయి. దేశ సంస్కృతి సంప్రదాయాలను,హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం. ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం. దీనినే కార్తీక వన భోజనాలుగా పేర్కొంటారు.
పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం వెనుక భ క్తి ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్నాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద విష్ణు భగవానుని ఎన్ని పుష్పాలతో పూజిస్తే వాటి సంఖ్యను బట్టి అన్ని అశ్వమేధ యాగాల ఫలం దక్కుతుందని కార్తీక పురాణంలో లిఖించి ఉంది.
కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట,పాట కబుర్లకు ఇది చక్కటి వేదిక. పిల్లలు,పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే క్రీ డలు, నృత్యాలు, సంగీత కచేరీలు నిర్వహించడానికి మంచి అవకాశం. వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. మానవ మనుగడకు వనాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వనసమారాధన అందిస్తోంది.
ప్రకృతి వనభోజనం కార్తీక మాస పూజా విధుల్లో ముఖ్యమైనది. కార్తీక మాసంలో వనభోజనం ఆచరించడం ఆధ్యాత్మిక, సామాజిక భావనలను పెంచుతుంది. ముక్తికే కాదు సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి దోహదపడుతాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయి. వన భోజనం అంటే పచ్చటి ఆకుల మధ్య ప్రకృతిలో మమేకమై ప్రకృతికి నివేదించే అందరూ కలిసి ఆనందంగా ఆరగించడం. ఆ తరువాత అందరూ కలిసి వండిన పదార్థాలను దేవునికి నివేదించి ఉసిరిక, అశ్వత్థ, బిల్వ తదితర వృక్షాల నీడలో సామూహింగా భోజనం చేస్తారు.
కార్తీక మాసంలోని వనభోజనాలను ఆదివారాలు, ఇతర సెలవు రోజులతో పాటు.. సమీప ఉద్యాన వనాలలో, తోటల్లో, నదీతీర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటారు. పిల్లలు, పెద్దలు సంతోషంగా గడుపుతారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కార్తీక మాసంలో పర్యాటక ప్రాంతాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోనూ ఏజెన్సీ ప్రాంతాల పర్యటనకు చాలామంది కార్తీక మాసాన్ని ఎంచుకుంటారు..