Corona on Jewellery: ఈ భూమిపైకి కరోనా వచ్చిన తరువాత మన జీవన శైలి చాలా వరకు మారిపోయింది. మాస్కులు, శానిటైజర్లు రోజువారీ జీవితంలో భాగంగా మారాయి. దీనికి తోడు వైరస్ వివిధ రకాల ఉపరితలాలపై ఎక్కువ సమయం జీవించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కార్డుబోర్డు, స్టెయిన్లెస్ స్టీలు, ఇతర మెటల్ ఉపరితలాలపై వైరస్ సుదీర్ఘంగా జీవించే ఉంటుందని అధ్యయనాలు తేల్చాయి. దాంతో బంగారు నగలు వేసుకునేవారు... ఆ నగలపై కరోనా ఎంతసేపు ఉంటుంది అనే డౌట్ వచ్చి... అది ఎక్కువ కాలం జీవించి ఉంటే.. ఆ నగలపై పిల్లలు చేతులు వేస్తే... వారికి వైరస్ సోకితే ప్రమాదం అని భావిస్తూ... నగలు వాడటం, కొనడం మానేస్తున్నారు. ఆభరణాలతో పాటు ఇతర విలాసవంతమైన వస్తువులను ధరించేందుకు ప్రజలు ఆసక్తి చూపట్లేదు. బంగారంపై వైరస్ ఎంత సమయం సజీవంగా ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. కాబట్టి నగలు వేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. (image credit - youtube)
అలా వైరస్ వ్యాప్తి: కొంతమంది చేతులు కడిగేముందు బ్రాస్లెట్లు, ఉంగరాలు, ఇతర ఆభరణాలు తీసివేస్తారు. శుభ్రం చేసుకున్న తరువాత వాటిని మళ్లీ ధరిస్తారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఒకవేళ ఆభరణాలపై నిజంగా వైరస్ ఉంటే, మళ్లీ వాటిని ధరించినప్పుడు అది చేతులకు అంటుకుంటుంది. అందువల్ల ఉంగరాలు, బ్రాస్లెట్లు వంటి వాటిని తీసివేయకుండానే చేతులు శుభ్రం చేసుకోవడం మంచిది. (image credit - youtube)
జ్యువెలరీ క్లీన్సర్లతో ఉపయోగం: కొన్ని లోహాలతో తయారు చేసిన ఆభరణాలను సబ్బు, శానిటైజర్‌తో శుభ్రం చేస్తే పాడైపోతాయి. ఉదాహరణకు.. సబ్బు నీటితో కడిగితే వెండి దెబ్బతింటుంది. లేదా షైనింగ్ పోయి, వెండి ఆభరణాలు పాతవాటిలా కనిపిస్తాయి. అందువల్ల వీటిని శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. మార్కెట్లో జ్యువెలరీ క్లీన్సర్ల పేరుతో ఇవి లభిస్తాయి. (image credit - youtube)
నగలకు శానిటైజర్ వద్దు: కరోనా తరువాత హ్యాండ్ శానిటైజర్లు, యాంటీ బాక్టీరియల్ సబ్బుల వాడకం పెరిగింది. అయితే వీటిని ఆభరణాలు శుభ్రం చేయడానికి ఉపయోగించకూడదు. వీటి తయారీలో వాడే రసాయనాలు.. సహజంగా లభించే ముత్యాలు, రత్నాల ఆకారాన్ని, మెరుపును దెబ్బతీస్తాయి. ముత్యాలు, పగడాలు, రంగురాళ్లు ధరించేవారు ఈ విషయంపై దృష్టి సారించాలి. వీటిని ఇతర మార్గాల్లో శుభ్రం చేయాలి. (image credit - youtube)
వాచ్‌లు ధరించడం మానేయాలా? మనం ధరించే ఆభరణాల్లో విలాసవంతమైన చేతి గడియారాలు కూడా చేరాయి. అయితే మనకు లభించే చేతి గడియారాల్లో.. వాటర్ ప్రూఫ్ ఉత్పత్తులు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణ చేతి వాచ్‌ను నీటితో శుభ్రం చేయడం కుదరదు. అంతేకాక వీటిని తోలు లేదా లోహాలతోనే తయారు చేస్తారు. వీటిపై వైరస్ ఎక్కువ సమయం సజీవంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల తరచుగా బయటకు వెళ్లేవారు.. కొన్ని రోజులు వాచ్‌లను ధరించకపోవడమే మంచిది. (image credit - youtube)