పుస్తెలమ్మైనా పులస తినాలనే సామెత ఉంది.. గోదావరి జిల్లాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఫేమస్ అయిన చేప పులస. సుదూర ప్రాంతాలనుంచి మైళ్ల కొద్దీ ఈదుకుని వచ్చి సముద్రం నుంచి గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించే పులసలంటే ఎంతో క్రేజీ. రాష్ట్రంలో కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రమే లభించే ఇవి ధరలోనే కాదు.. రుచిలోనూ రారాజు అంటారు.
ఏడాదిలో రెండు మూడు నెలలు మాత్రమే లభిస్తుండగా, సీజన్లో వేలకు వేలు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేసి జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరచుకుంటారు సీ ఫుడ్స్ ను ఇష్డపడే ప్రియులు. గోదావరికి వరద నీరు మొదలైనప్పటి నుంచి ఇంచుమించుగా జూలైలో ప్రారంభమై సెప్టెంబర్ వరకూ నర్సాపురం నుంచి దవళేశ్వరం వరకూ పులసలు విరివిగా జాలర్లకు చిక్కుతుంటాయి.
హిల్సా ఇలీషా నామంతో ఆయా ప్రాంతాల్లో పిలిచే ఈ చేప గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించేటప్పటికి పులసగా పిలవబడుతుంది. పులసకు ఉండే డిమాండ్‌తో కొన్ని ప్రాంతాల్లో ఇలసలను పులసలుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఒడిశా సముద్రతీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరకు తీసుకువచ్చి పులసలుగా ఇక్కడ కొందరు అమ్మకాలు సాగిస్తుంటారు.
ఇలస - పులస మధ్య తేడాను గుర్తించడం కష్టసాధ్యమే. నిజమైన పులస ఎర్రనీటి ప్రయాణం చేసి కొద్దిపాటి ఎర్రనీటిఛాయతో వెండి రంగుతో, ధగధగమంటూ గోధమవర్ణంలో కనిపిస్తుంటాయి. ఇలసలు తెలుపుగానే కనిపిస్తాయి. దీంతో వీటి మధ్య తేడా గుర్తించడంలో కష్టం కావడంతో ఇలసలే పులసలుగా భావించి కొనుగోలు చేసేవారూ అధికంగానే ఉంటారు. దీంతో పులస ప్రియులు వీటిని ఆచితూచి కొనుగోలు చేయాల్సిందే.
నానుడికి తగ్గట్టుగానే పులస ధర సైతం నిజంగా పుస్తేలు అమ్ముకునే స్థాయిలోనే ఉంటాయి. సామాన్య కుటుంబాలకు పులస కొనాలంటే కలగానే మిగిలిపోతుంది. కేజీ బరువుండే పులసలు 1500 నుంచి రూ.6000 వరకూ సమయాన్ని బట్టి అమ్మకాలు సాగిస్తుంటారు. సాధారణంగా పులస దొరకాలంటే కష్టసాధ్యంగానే ఉంటుంది. దీంతో ఇలసలు లభించే ప్రాంతాల్లో వీటి ధర 1000 వరకూ అమ్ముతుంటారు. తెలియని వారు వీటినే పులసలుగా భావించి కొనుగోలు చేస్తుంటారు.