ఆరోగ్య సంరక్షణతో పాటు బొద్దింకలు, ఇతర కీటకాల నివారణలోనూ పుదీనా సమర్థంగా పనిచేస్తుంది. కొన్ని ఎండిన లేదా తాజా పుదీనా ఆకులను బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో వేయాలి. లేదంటే పుదీనా ఎసెన్షియల్ ఆయిల్, నీరు కలిపి బొద్దింకలు కనిపించే ప్రదేశాలలో స్ప్రే చేయాలి. వీటి వాసనల వల్ల కీటకాలు ఇబ్బందిపడి, ఇంటి నుంచి వెళ్లిపోతాయి.
ఇంటి నుంచి బొద్దింకలను తరిమికొట్టడానికి ఖరీదైన రసాయనాలను వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే లభించే బిర్యానీ ఆకులను అవి తరచుగా కనిపించే ప్రాంతాల్లో వేస్తే చాలు. భారతీయులు వివిధ రకాల వంటకాల్లో బిర్యానీ ఆకులను వాడతారు. బొద్దింకలు ఈ ఆకుల సువాసనను భరించలేవు. అందువల్ల బిర్యానీ ఆకులను పొడిగా చేసి, ఇంట్లో అక్కడక్కడా చల్లితే.. బొద్దింకలు ఇంట్లోకి రావు.
మిరియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయల వాసనలను బొద్దింకలు భరించలేవు. ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని ఇంట్లో బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో స్ప్రే చేస్తే చాలు.. అవి ఇంటి నుంచి వెళ్లిపోతాయి. వీటితో పాటు దోసకాయ పొట్టు, తినుబండారాల్లో కలిపిన బోరాక్స్ పౌడర్ లేదా బోరిక్ యాసిడ్ వంటివి సైతం బొద్దింకలను తరిమికొట్టగలవు.